విజయమ్మను ఓడించిన ప్రాంతం అది.
రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీచినా, అక్కడ టీడీపీ నిలబడిన ప్రాంతం అది. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీకి విశాఖలో ఎదురుగాలులే. ఈ లెక్కలు చూసుకుంటే విశాఖను జగన్ అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ జగన్ అలా చేయలేదు.
తన రాజకీయాల కంటే, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అనుకున్నారు. మరీ ముఖ్యంగా వికేంద్రీకరణలో భాగంగా ఉత్తరాంధ్ర మొత్తం అభివృద్ధి చెందాలని భావించారు. అందుకే విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్నారు.
రాజకీయంగా ఇది చాలామందికి మింగుడుపడని విషయమే. మరీ ముఖ్యంగా ఐదేళ్లు చంద్రబాబు రాజకీయం చూసిన కళ్లతో ఇలాంటి మంచి పనుల్ని, విప్లవాత్మక నిర్ణయాల్ని చూడడం, చూసి జీర్ణించుకోవడం కాస్త కష్టమే. ఎందుకంటే తనకు నచ్చని, గిట్టని ప్రాంతాలు, నియోజకవర్గాల్ని చంద్రబాబు ఎలా తొక్కిపడేశారో గడిచిన ఐదేళ్లలో చూశాం.
అందుకే జగన్ అందరికీ ఓ స్వీట్ షాక్ లా కనిపిస్తున్నారు. ఊహలకు కూడా అందని నిర్ణయాలతో నవ్యాంధ్రను నిర్మించడం కోసం కష్టపడుతున్నారు.నిజానికి జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే రాజధాని అంశం రాయలసీమ చుట్టూ తిరిగింది. ఆ ప్రాంతానికి చెందిన నేత కావడం, కర్నూలుపై స్వతహాగా సాఫ్ట్ కార్నర్ ఉన్న వ్యక్తి కావడంతో.. ఈసారి కర్నూలు రాజధానిగా మారడం ఖాయమని అంతా భావించారు.
టీడీపీ నేతలు కూడా మనసులో అదే భావంతో ఉన్నారు. అమరావతిని వద్దనుకుంటే, కర్నూలుకే వెళ్తారని అనుకున్నారు. కానీ జగన్ మాత్రం ప్రజాభీష్టం మేరకు పనిచేశారు. రాష్ట్ర విభజన టైమ్ లో విశాఖనే రాజధానిగా చేస్తారని మెజారిటీ ప్రజలు భావించారు. ఇప్పుడా మెజారిటీనే గౌరవించారు ముఖ్యమంత్రి జగన్.
అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా కూడా అతడికి కలిసొచ్చేదే. ఇకపై విశాఖ ప్రాంతంలో వైసీపీకి ఎదురుగాలి వీచే అవకాశం లేదు. తాజా నిర్ణయంతో విశాఖతో పాటు చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా పండగ చేసుకుంటున్నారు.
ఇన్నాళ్లకు ఉత్తరాంధ్రకు ఓ కళ వచ్చిందని అక్కడి ప్రజలు ఆనందపడుతున్నారు. సో.. ఈసారి వైసీపీకి అక్కడ బ్రహ్మరథం పట్టడం ఖాయం. త్వరలోనే రాష్ట్రమంతా జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు.. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి అఖండ విజయం తథ్యం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.