200 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డ వ్యవహారాలకు సంబంధించి ఈడీ కేసులను ఎదుర్కొంటున్న సుఖేష్ చంద్రశేఖర్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు భారీ స్థాయిలో బహుమతులను ఇచ్చాడనే వార్తలు ఇది వరకే వచ్చాయి. ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ కు సంబంధించి ఇది వరకే లీకులు వచ్చాయి. అందుకు సంబంధించి ఇప్పుడు మరిన్ని వివరాలు అందుతున్నాయి.
ప్రత్యేకించి సుఖేష్ చంద్రశేఖర్ తనకు ఎలా పరిచయం అనే అంశం గురించి జాక్వెలిన్ వివరించిన వైనం ఆసక్తిదాయకంగా ఉంది. సుఖేష్ తనను తాను సన్ టీవీ ఓనర్నంటూ పరిచయం చేసుకున్నట్టుగా జాక్వెలిన్ ఈడీకి వివరించిందట. మారన్ కుటుంబానికి సంబంధించిన సన్ టీవీ ఓనర్నంటూ సుఖేష్ పరిచయం చేసుకున్నాడట. తను కూడా ఆ కటుంబానికి సంబంధించిన వాడినంటూ చెప్పుకున్నాడట.
బోలెడన్ని సినీ అవకాశాలు అంటూ తనకు అతడు చెప్పాడని జాక్వెలిన్ తన స్టేట్ మెంట్ లో చెప్పిందట. అలా తనకు అతడు దగ్గరయినట్టుగా, తనకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ గా మారినట్టుగా ఈ హీరోయిన్ చెప్పిందని సమాచారం.
ఇక జాక్వెలిన్ కు సుఖేష్ ప్రధానంగా ఇచ్చిన బహుమతుల్లో ఇయర్ రింగ్స్ ఎక్కువగా ఉన్నట్టున్నాయి. ఏకంగా పదహారు జతల ఇయర్ రింగ్స్ ను ఈ హీరోయిన్ కు బహుమతిగా ఇచ్చాడట అతడు. జాక్వెలిన్ కు సుఖేష్ ఇచ్చిన బహుమతుల విలువ సుమారు ఏడు కోట్ల రూపాయలని ఈడీ తన చార్జిషీట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.
ఇక కేవలం ఆ హీరోయిన్ కే కాదట, వారి కుటుంబ సభ్యులకు కూడా సుఖేష్ పలు బహుమతులు ఇచ్చాడట. అమెరికాలో ఉండే జాక్వెలిన్ సోదరి ఒకరికి భారీ మొత్తంలో డబ్బును గిఫ్ట్ గా ఇచ్చాడట. అలాగే జాక్వెలిన్ సోదరుడు కూడా ఇలాంటి లబ్ధే పొందాడట. ఇక జాక్వెలిన్ తల్లిదండ్రులకు కూడా సుఖేష్ ఖరీదైన కార్లను గిఫ్టులుగా ఇచ్చాడట.
జాక్వెలిన్ కు కూడా ఒక ఖరీదైన కారును అతడు బహుమతిగా ఇచ్చాడట. అయితే ఆమె దాన్ని మళ్లీ అతడికే వెనక్కు ఇచ్చిందట. తనకు కావాల్సిన వాటి కోసం షోరూమ్ లకు వెళ్లి జాక్వెలిన్ అక్కడ సెలెక్ట్ చేస్తే, వాటికి సంబంధించి సుఖేష్ పే చేసేవాడట!