ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అనేది అమరావతిలో మాత్రమే ఉండాలని పోరాడుతున్న వారు.. పాదయాత్ర రూపంలో తిరుమలకు వెళుతున్నారు. ప్రస్తుతం తిరుపతి దాకా వచ్చారు. వీరి పాదయాత్ర ప్రారంభం అయిన నాటినుంచి వీరికి ఊరూరా ఘన స్వాగతాలు లభిస్తున్నట్టుగా, జనం అనుకూల స్పందన వెల్లువెత్తుతున్నట్టుగా బోలెడన్ని వార్తలు వస్తున్నాయి.
మీడియాలో అమరావతికి అనుకూల వర్గాలు పుష్కలంగా ఉన్నాయి గనుక.. గోరంతను కొండంతలుగా చూపే వార్తలు పుష్కలంగా వస్తున్నాయి. ప్రతి ఊరిలో అడుగుపెట్టినప్పుడు ఎంతో కొంత స్పందన వస్తూనే ఉంది. అయితే.. ‘న్యాయస్థానం టూ దేవస్థానం’ యాత్ర చివరి అంకంలో తిరుపతి చేరుకునే సమయానికి పాదయాత్రికులకు ఒక వెరైటీ చేదు స్వాగతం ఎదురైంది.
‘‘మాకు మూడు రాజధానులే కావాలి’’ అనే నినాదంతో వెలిసిన పోస్టర్లు వారికి తిరుపతి ముఖద్వారం నుంచి దర్శన మిచ్చాయి. ‘మీతో మాకు గొడవలు వద్దు.. మీకు మా స్వాగతం. మాకు మూడు రాజధానులే కావాలి’ అని తిరుపతి ప్రజలు పేర్కొంటున్నట్టుగా ఫ్లెక్సి పోస్టర్లు వెలిశాయి. దీంతో పాదయాత్రికులు ఖంగు తిన్నారు. మొత్తానికి అమరావతి మాత్రమే రాజధాని అనే ప్రతిపాన పట్ల అన్ని ప్రాంతాల్లోనూ స్పందన ఒకే రీతిగా లేదని, అందులోకూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే సంగతి మాత్రం స్పష్టమైంది.
ఈ కీలకమైన సమయంలో మరో సంగతిని గుర్తించాల్సి ఉంది. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలనే డిమాండ్ తో అక్కడ వారు దీక్షలు చేయడం ప్రారంభించి ఎంతో కాలం గడుస్తోంది. వెనక్కి మళ్లకుండా వారు దీక్షల్ని కొనసాగిస్తున్నారు. అంతవరకు అంతా బాగానే ఉంది. అయితే ఇతర ప్రాంతాలనుంచి వారికి ఏ మరకు మద్దతు లభిస్తూ వస్తోందన్నది కీలకం.
అమరావతి మాత్రమే రాజధాని అనే డిమాండ్ కు ఇతర ప్రాంతాల మద్దతు నిజమేఅయితే.. వారే స్వచ్చందంగా అమరావతికి వచ్చి వారి దీక్షల్లో పాల్గొని ఉండాలి. అలా ఎన్నడూ జరగనేలేదు. అదే పాదయాత్ర ప్రారంభం అయ్యాక ప్రతి ఊరిలో కొంత సానకూల స్పందన కనిపించింది. ఇదంతా కేవలం రాజకీయ ప్రేరేపిత స్పందన మాత్రమే అన్నది అందరికీ తెలుసు.
తెలుగుదేశం పార్టీ ఈ యాత్రకు ఫండింగ్ చేస్తోందన్న పెద్ద ఆరోపణ. అయితే.. ప్రతి ఊరిలో కూడా.. వారికిక ఏర్పాట్లు సమస్తం తెలుగుదేశం నాయకులే చూస్తూ వచ్చారు. బీజేపీ స్టాండ్ మార్చుకున్న తరువాత.. ఆ పార్టీ వారు, జనసేన, వామపక్షాలు కూడా ఊరూరా వారికి స్వాగతం పలికాయి. అంతే తప్ప ప్రజలు స్వచ్ఛందంగా వారికి స్వాగతం చెప్పారా? మద్దతిచ్చారా? అనేది పెద్ద సంగతి.
ఇప్పుడు తిరుపతిలో ‘మాకు మూడు రాజధానులే కావాలి’ అనే పోస్టర్లు పెద్ద వివాదం అయ్యాయి. ఆ పోస్టర్లలోనే మీతో మాకు గొడవలు వద్దు అని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. పాదయాత్రలోని వారు ఇలాంటి పోస్టర్లను చించివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ పోస్టర్లు కూడా వైసీపీ తరఫునుంచి రాజకీయ ప్రేరేపిత పోస్టర్లే కావచ్చు గాక, కానీ పాదయాత్రికుల సహించలేక, రెచ్చిపోతే ఎలా? ఉద్రిక్తతలకు అవకాశం ఇస్తే ఎలా అనేది మీమాంస!
అమరావతి రాజధానికి సార్వజనీనమైన మద్దతు లేదన్నది స్పష్టం. పాదయాత్రల పేరిట గుడులు తిరుగుతూ విరాళాలు స్వీకరిస్తూ వారు ఎన్ని కార్యక్రమాలైనా నడిపించవచ్చు గాక.. కానీ వారు నిజమైన ప్రజల మద్దతు సాధించడం లేదని తెలుసుకోవాలి. అందుకు మార్గాలేమిలో వారు అన్వేషించాలి. అంతే తప్ప.. తెలుగుదేశం ప్రేరేపిత మద్దతును చూసుకుని.. తమ డిమాండ్ కు ప్రజలు నీరాజనాలు పడుతున్నారనే భ్రమలో బతికితే.. వారికే నష్టం జరుగుతుంది.