కనబడుట లేదు: వైసీపీ ఎంపీలంతా ఎక్కడ?

లోక్ సభలో 25 సీట్లకు గాను 22చోట్ల గెలిచి చరిత్ర సృష్టించింది వైసీపీ. అత్యథిక ఎంపీ స్థానాలిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్ ఎన్నికల ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావించారు కూడా.…

లోక్ సభలో 25 సీట్లకు గాను 22చోట్ల గెలిచి చరిత్ర సృష్టించింది వైసీపీ. అత్యథిక ఎంపీ స్థానాలిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్ ఎన్నికల ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావించారు కూడా. మరి దానికి అనుగుణంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరుగుతోందా? ఈ విషయంలో వైసీపీ ఎంపీల పాత్ర ఎంత?

జగన్ ప్రస్తుతానికి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. అదే సమయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా సమయానుకూలంగా స్పందిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం ప్రతినిధులతో భేటీ అయిన సీఎం జగన్ వారి ముందుంచిన ప్రధాన ప్రతిపాదన ఇదే.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి సాయం చేయండి అని కోరారు. విభజన సమయంలో కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన ప్రత్యేక హోదా అంశాన్ని, గత రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని వివరించారు.అంతా బాగానే ఉంది కానీ.. కనీసం ఈ భేటీలో కూడా వైసీపీ ఎంపీలెవరూ పాల్గొనలేదు.

అసలు ఏపీకి చెందిన ఎంపీలలో ఎంతమంది నియోజకవర్గాల్లో కనిపిస్తున్నారన్నదానికి సమాధానమే దొరకడం లేదు. కనీసం సొంత మీడియాలో కూడా వైసీపీ ఎంపీల ప్రస్తావన లేదు. ఒక్క విజయసాయిరెడ్డి మాత్రమే మీడియా ముందు గళం విప్పుతూ కనిపిస్తారు. ఎంపీకి మించిన బరువు బాధ్యతలు ఆయనకున్నాయి కాబట్టి అది వేరే సంగతి.

ఆయన తర్వార రఘురామ కృష్ణంరాజు మాత్రమే విందు, వినోదాలతో వార్తల్లో ఉన్నారు. ఇక తాజాగా గోరంట్ల మాధవ్ తెరపైకి వచ్చారు. అది కూడా జేసీ వ్యవహారం కావడంతో ఆయన కెమెరాముందుకొచ్చారు. మిగతా వారి విషయానికొస్తే.. పార్లమెంట్ లో అటెండెన్స్ బాగానే ఉంటుంది కానీ, సొంత నియోజకవర్గాల్లో మాత్రం వారి జాడే కనిపించడం లేదు.

పార్లమెంట్ సమావేశాల ముందు జగన్ తో భేటీ తర్వాత పెట్టిన మీడియా సమావేశం మినహా.. ఇంతవరకూ మళ్లీ వాళ్లు మీడియాకు మొహం చూపించిన దాఖలాల్లేవు. టీడీపీ ముగ్గురు ఎంపీలు నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో వ్యక్తుల్లా కనిపిస్తున్నారు,కానీ వైసీపీ ఎంపీలు మాత్రం నియోజకవర్గాలకూ, మీడియాకూ దూరంగా కాలం గడిపేస్తున్నారు.

జగన్ ఆదేశాల మేరకు వీరు సైలెంట్ అయ్యారా లేక, అభివృద్ధి బాధ్యత కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులదే అనుకుంటున్నారో తెలియదు.మొత్తమ్మీద వైసీపీ ఎంపీల్లో చురుకుదనం తగ్గిందనే మాట మాత్రం వాస్తవం. నియోజకవర్గాల్లో పర్యటించి, ప్రభుత్వ పథకాలను వివరించడం, ఎంపీ ల్యాడ్స్ నిధులతో స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వంటి కార్యక్రమాల్ని వీళ్లు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో..!