విధి నిర్వహణలో అధికార పార్టీ ఎంపీని ఓ పోలీస్ అధికారి ఎదిరించడమంటే చిన్న విషయం కాదు. నిజానికి, సదరు ఎంపీనే తన స్థాయిని తగ్గించుకుని.. ఓ సాధారణ పోలీస్ అధికారిపై రెచ్చిపోయాడు. మామూలుగా అయితే, సదరు పోలీస్ అధికారి, ఆ ఎంపీగారి హెచ్చరికలకి బెదిరిపోవాలి. కానీ, ఆయన పోలీస్ సింహం లాంటోడు. మీసం మెలేశాడు. అంతే, ఒక్కసారిగా రాజకీయ దుమారం చెలరేగింది.
కట్ చేస్తే, ఆ ఎంపీగారి పదవి పోయింది.. పోలీస్ సింహానికి ప్రజలు పట్టం కట్టారు.. ఎంపీగా గెలిపించారు. పరిచయం అక్కర్లేని పేరది. ఆయనే గోరంట్ల మాధవ్. మరోపక్క విర్రవీగిన జేసీ దివాకర్ రెడ్డి, ఆయన కుటుంబం రాజకీయంగా ఇప్పుడెలాంటి పరిస్థితుల్లో వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు, జేసీ దివాకర్‌రెడ్డి.. మళ్ళీ అధికారంలోకి వచ్చాక పోలీసులతో బూట్లు నాకించుకుంటానని ప్రగల్భాలు పలికారు.ఓసారి నోరు పారేసుకున్నందుకే.. జేసీ దివాకర్ రెడ్డి రాజకీయం అతలాకుతలమైపోయింది. ఇప్పుడిక ఆయన ఎలాంటి స్థాయిని కోరుకుంటున్నారో ఆయనకే తెలియాలి.
ఇదిలా వుంటే, మరోసారి గోరంట్ల మాధవ్, జేసీ దివాకర్‌రెడ్డిపై మండిపడ్డారు. పోలీస్ బూటుని శుబ్రం చేయడమే కాదు, దాన్ని ముద్దాడి.. జేసీ దివాకర్‌రెడ్డికి షాకిచ్చారు. 'నేను గర్వపడుతున్నా పోలీస్‌గా పనిచేసినందుకు.. ఇప్పుడూ సిద్ధంగానే వున్నా పోలీస్‌గా బాధ్యతలు నిర్వహించేందుకు..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుమతిస్తే, ఎంపీ పదవికి రాజీనామా చేసి, మళ్ళీ పోలీస్ అవతారమెత్తుతా..' అని గోరంట్ల మాధవ్ చెప్పుకొచ్చారు.
ఓసారి అధికారం రుచి చూశాక, మళ్ళీ లాఠీ పట్టుకోవాలని ఎవరైనా అనుకుంటారా.? అందుకే గోరంట్ల మాధవ్‌ని ఇప్పుడంతా పోలీస్ సింహం అంటున్నారు. 'పోలీస్ వ్యవస్థకే ఆయన గౌరవం తెచ్చారు..' అంటూ రాష్ట్ర పోలీసులు గోరంట్ల మాధవ్ తాజా చర్యలపై వ్యాఖ్యానిస్తున్నారు.మరోపక్క, జేసీని పక్కన పెట్టుకుని.. రాజకీయంగా దిగజారిపోయిన చంద్రబాబు, ఇంకా ఆయన్ని సమర్థిస్తూ పోతే.. రాజకీయంగా తన ఉనికిని కోల్పోవడం ఖాయమని టీడీపీ నేతలే కొందరు వాపోతున్న పరిస్థితి నెలకొంది.