ఇప్పటికి అయిదేళ్ల క్రితం ఒక దారుణం జరిగింది. విశాఖ ఏజెన్సీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావుని, ఆయన వెంట ఉన్న మాజీ ఎమ్మెల్యే సివేరి సోముని మాటు వేసి పట్టుకుని దారుణంగా హత్య చేశారు. 2014లో వైసీపీ తరఫున గెలిచిన కిడారి సర్వేశ్వరరావు 2017లో తెలుగుదేశంలో చేరారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తామని తెలుగుదేశం హామీ ఇవ్వడంతో ఆయన పార్టీలో చేరారు.
ఆయనని అప్పటికే టార్గెట్ చేసిన మావోయిస్టులు సరైన టైం చూసి దారి కాచి పట్టుకున్నారు. ప్రజా కోర్టు నిర్వహించి హత్య చేశారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా జనుమూరు శ్రీనుబాబు అలియాస్ రైనో అలియాస్ సునీల్ ఉన్నారు. ఆయన చిన్న నాయకుడు ఏమీ కాదు.
మావోయిస్ట్ పార్టీలో 2000లో చేరిన శ్రీను గత రెండు దశాబ్దాలుగా ఏవోబీ ప్రత్యేక జోన్ డివిజినల్ కమిటీ సభ్యుడిగా ఆంధ్రా ఒడిషా బోర్డర్ లో అనేక హింసాత్మక సంఘటనలతో పాటు యాక్షన్ ప్లానింగులతో పాటు నేరాలలో పాలు పంచుకున్నాడు. ఆయన మీద గత ప్రభుత్వం అయిదు లక్షల రూపాయల రివార్డు సైతం ప్రకటించింది.
ఇన్నాళ్ళకు మావోయిస్టు నేత జనుమూరు శ్రీనుబాబు అలియాస్ రైనో అలియాస్ సునీల్ పోలీసులకు పట్టుబడ్డాడు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సునీల్ తమకు చిక్కినట్టు సీలేరు పోలీసులు తెలిపారు. ఇక పట్టుబడిన నిందితుడి నుంచి ఐఈడీ, తుపాకి, పేలుడు సామగ్రి, విప్లవ సాహిత్యం, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రా ఒడిషా ప్రభుత్వాలకు శ్రీను మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అని వెల్లడిస్తున్నారు.
ఈ మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ ద్వారా నాడు జరిగిన టీడీపీ ఎమ్మెల్యే దారుణ హత్యకు సంబంధించిన మరింత సమాచారం వెల్లడి అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఏజెన్సీలో ప్రజా ప్రతినిధులే టార్గెట్ గా పెట్టుకుని ఇప్పటికే కొందరిని హత్య చేశారు. ఆ హిట్ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు అన్నది కూడా పోలీసు విచారణలో తెలిసే అవకాశం ఉంది అంటున్నారు.