2014 ఎన్నికల టైమ్ లో చంద్రబాబు అన్నీ తానై చూసుకున్నారు. అటు బీజేపీకి, ఇటు జనసేనకు తానే మధ్యవర్తిగా వ్యవహరించారు. బీజేపీ అధినాయకత్వంతో చర్చలు జరపడంతో పాటు.. పవన్ కల్యాణ్ ను దువ్వడంలో సక్సెస్ అయ్యారు బాబు. అప్పుడు బాబు చేసిన మధ్యవర్తిత్వాన్ని ఈసారి పవన్ కల్యాణ్ చేయబోతున్నారు.
ఇటు టీడీపీని, అటు బీజేపీని కలిపే బాధ్యతను పవన్ కల్యాణ్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. నిన్న జరిగిన దీక్షలో పవన్ మాటలు వింటే ఇదే విషయం స్పష్టమౌతోంది. ఎలాగోలా 2024 ఎన్నికలనాటికి బీజేపీ-టీడీపీని కలిపి, ఆ కూటమిలో తను కూడా చేరి వైసీపీని ఓడించాలనే కసి పవన్ కల్యాణ్ లో స్పష్టంగా కనిపించింది.
మూడు పార్టీల కలయిక ఎవరికి లాభం..?
2014 ఎన్నికల్లో పొత్తు వల్ల చంద్రబాబు లాభపడ్డారు. అప్పటి మోదీ వేవ్ కూడా బాబుకి కలిసొచ్చింది. అయితే పొత్తు నిబంధనల్లో భాగంగా జనసేనని పోటీకి దించకుండా పవన్ మోసపోయారు. 2019లో ఒంటరిపోరు ఎంత కష్టమో పవన్ కి తెలిసొచ్చింది. అప్పుడు కూడా చిన్న చిన్న పార్టీలన్నీ పవన్ క్రేజ్ వాడుకున్నాయి కానీ జనసేనకు లాభం లేదు.
2014లో పెద్ద పార్టీల చేతిలో మోసపోయిన పవన్, 2019లో చిన్నా చితకా పార్టీలను నమ్ముకుని దెబ్బతిన్నారు. అయితే 2024నాటికి కనీసం తనకి ఉపయోగపడే పని చేయాలనుకుంటున్నారు జనసేనాని. అందుకే టీడీపీ, బీజేపీని కలిపి.. పొత్తులో భాగంగా కనీసం గెలవగలిగే సీట్లు కొన్ని తీసుకుని అసెంబ్లీలో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు.
టార్గెట్ వైసీపీ..
శత్రువుకి శత్రువు మిత్రుడు అనే భావనలో 2024 ఎన్నికలనాటికి వైసీపీ శత్రువులంతా ఒకే గొడుగు కిందకు చేరతారు. కానీ టీడీపీ అన్నా, చంద్రబాబు అన్నా బీజేపీ అధిష్టానానికి అంత నమ్మకం లేదు. అందుకే ఇక్కడ జనసేనాని ఎంట్రీ ఇస్తున్నారు. టీడీపీ తరపున వకాల్తా పుచ్చుకుని రాయబారం నడిపేందుకు సిద్ధమయ్యారు.
సహజంగా ఇలాంటి వ్యవహారాలకు పవన్ కల్యాణ్ దూరం. ఎవరైనా తన దగ్గరకే రావాలి, తననే బ్రతిమిలాడుకోవాలి అనుకునే రకం పవన్. కానీ అది సినిమాల్లో వర్కవుట్ అవుతుంది కానీ, రాజకీయాల్లో తన స్థాయి ఏంటో పవన్ కి బాగా తెలిసొచ్చింది. పైగా జగన్ ను అధికారం నుంచి దించాలనే కసితో ఉన్నారాయన.
అందుకే ఈసారికి అన్నీ వదిలేసి టీడీపీ, బీజేపీ మధ్య రాయబారం నడిపేందుకు సిద్ధమయ్యారు. ఆ పొత్తు సజావుగా సాగితే, మధ్యలో తాను లాభపడొచ్చని అంచనా వేస్తున్నారు. గతంలో పోటీ చేయకుండా ఉండేందుకు ఓ ప్యాకేజీ, పోటీ చేసి ప్రతిపక్ష ఓట్లు చీల్చేందుకు మరో ప్యాకేజీ తీసుకున్న పవన్.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రాయబార ప్యాకేజీకి సిద్ధమైనట్టు కనిపిస్తోంది.