CAPITAL- పెట్టుబడి, మూలధనం, స్తంభం అగ్రభాగం, రాజధాని: క్యాపిటల్‌కు డిక్షనరీలోని అర్థాలవి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో క్యాపిటల్‌కు నికార్సైన తెలుగు అర్థం ‘ పెట్టుబడి’. చంద్రబాబు చాలా తెలివైన వ్యక్తి కావడంతో చివరిగా ఉన్న ‘ రాజధాని’ పేరుతో ఆయన వ్యాపారం చేశాడు.
ఇప్పుడా రాజధానికి ముప్పు వాటిల్లడంతో తనను నమ్ముకుని, ప్రజల నమ్మకాన్ని అమ్ముకుని ఆర్జించిన లాభాలు బూడిదలో పోసిన పన్నీరవుతాయని తెగ బాధపడి పోతున్నారు.2014లో చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టాక తన పార్టీ వ్యాపారవేత్తలతో రాజధానిపై ఆయన చేసింది ముమ్మాటికీ పచ్చి వ్యాపారమే.
ఇంకా చెప్పాలంటే ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి దోపిడీకి పాల్పడ్డారు. అదెలాగో గత ఐదేళ్లలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చిద్దాం.2014 జూన్ 1 నుంచి డిసెంబరు వరకు కేవలం ఆరు నెలల్లో 4,070 ఎకరాలను రాజధాని మారుమూల ప్రాంతాల్లో అనంతపురం , కడప, హైదరాబాద్, గుంటూరు, తదితర జిల్లాల నుంచీ, అదీ కూడా కేవలం టీడీపీ రాజకీయ నాయకులుగా అవతారమెత్తిన వ్యాపారవేత్తలు, వారి బంధువులు కారుచౌకగా కొన్నారు.
ఇది ఎలా సాధ్యం…నిన్న అసెంబ్లీ సమావేశాల్లో రాజధానిపై జరిగిన చర్చలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి టీడీపీ సభ్యులకు వేసిన సూటి ప్రశ్న.దీన్నే ఇన్సైడర్ ట్రేడింగ్ అని పిలుస్తారని, ఇది నేరమని ఆయన చెప్పుకొచ్చాడు. భూమి కొన్న వాళ్లలో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ఫుడ్స్ సంస్థ ముందు వరుసలో ఉంది.
భూమి కొన్నవాళ్లలో యనమల రామకృష్ణుడి అల్లుడు, పరిటాల సునీత అల్లుడు, మాజీ మంత్రి నారాయణ తన సంస్థ ఉద్యోగుల పేరుతోనూ…ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం బయట పడిన మేరకు 4, 070 ఎకరాలు ఉందని ప్రభుత్వం లెక్క తేల్చింది. ఇంకా లెక్కలు తీస్తున్నట్టు ఆయన చెప్పాడు.
అసలు రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ధారించేందుకు ఆనాటి యూపీఏ సర్కార్-2 శివరామకృష్ణన్ కమిటీ వేసింది. ఈ కమిటీలో శివరామకృష్ణన్‌కు పట్టణాభివృద్ధిపై పట్టు ఉంది. ఇక మిగిలిన సభ్యులు సంబంధిత రంగాల్లో నిపుణులు. ఈ కమిటీని కాదని చంద్రబాబు హడావుడిగా నాటి మంత్రి నారాయణ నేతృత్వంలో కమిటీని ఎందుకు వేయాల్సి వచ్చింది. ఈ కమిటీలో టీడీపీ వ్యాపారవేత్తలైన బీద మస్తాన్‌రావు, గల్లా జయదేవ్, సుజనాచౌదరి తదితరులను నియమించడంతో చంద్రబాబు సర్కార్ ఉద్దేశం ఏంటి?
అంటే మొదట చెప్పుకున్నట్టు CAPITAL అంటే పెట్టుబడి అనేదే అర్థమైంది తప్ప రాజధానిగా అమరావతిని ఎందుకు చూడలేకపోయారు. అసైన్డ్ భూమిని బినామీలతో ఇష్టానుసారం కొనుగోలు చేయడం ద్వారా టీడీపీ పాలకులు వ్యాపారం కాక మరేం చేశారో జనానికి సమాధానం చెప్పాలి. అలాంటి రాజధానికి బదులుగా మరో రెండు ప్రజారాజధానులు ఏర్పాటు చేస్తామని జగన్ సర్కార్ ప్రకటిస్తే టీడీపీ వ్యాపారులకు భయమెందుకు? తమ వ్యాపార సామ్రాజ్యాలు కూకటివేళ్లతో సహా కూలిపోతాయనే భయమా?