ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సహజం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో లోపాలుంటే, ప్రభుత్వం చేసే పనుల్లో, చర్యల్లో ప్రజా వ్యతిరేకమైనవి ఉంటే తప్పనిసరిగా విమర్శలు చేయాలి. జనంలోకి తీసుకెళ్లి ఎండగట్టాలి. ఇది ప్రతిపక్షాల బాధ్యత. కాని అర్ధరహితంగా, ఆవేశంగా, బేస్లెస్గా విమర్శలు చేస్తే ఏమనుకోవాలి? విమర్శల కోసమే విమర్శలు చేయకూడదు కదా.
ఏపీలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చేస్తున్న విమర్శలు ఇలాగే ఉన్నాయి. అత్యాచారాలను అరికట్టడానికి, అత్యాచారం కేసుల్లో దోషులకు కఠిన శిక్ష విధించడానికి, కేసులు త్వరితగతిన పరిష్కరించడానికి ఉద్దేశించిన 'దిశ బిల్లు' ఏపీ అసెంబ్లీ ఆమోదించి ఇంకా వారం రోజులు కూడా కాలేదు. దానిపై అప్పుడే టీడీపీ నాయకులు విమర్శలు మొదలుపెట్టారు.
కొత్త నాయకులతోపాటు ఎంతో రాజకీయ, పరిపాలనా అనుభవం ఉన్న నేతలు కూడా విమర్శలు చేస్తున్నారంటే ఇది ప్రభుత్వంపై వారి అసహనాన్ని తెలియచేస్తోంది. ఏదైనా చట్టం చేయాలనుకున్నప్పుడు దాన్ని ముందుగా బిల్లు రూపంలో సభలో ప్రవేశపెట్టాక, దానిపై చర్చ జరిగాక, అది సభ ఆమోదం పొందాక గవర్నర్ లేదా రాష్ట్రపతి ఆమోదం పొందాకనే చట్టం అవుతుంది.
అప్పుడు అది అమల్లోకి వస్తుంది. ఇదీ కదా ప్రాసెస్. దిశ బిల్లు ఇంకా చట్టంగా మారలేదు. కాని టీడీపీ నాయకులు దిశ చట్టం తెచ్చినా ఇంకా అత్యాచారాలు ఆగడంలేదని, ప్రభుత్వం విఫలమైందని విమర్శలు చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఇదే విమర్శ చేయగా, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు కూడా ఇదే విమర్శ చేశారు.
దిశ చట్టం అమల్లోకి వచ్చాక అత్యాచార కేసుల్లో దాని ప్రకారం విచారణ, దర్యాప్తు జరుగుతున్నాయా? లేదా? శిక్షలు పడుతున్నాయా? లేదా? అని గమనించాలి. ఆ చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తున్నారా లేక చట్టుబండలు చేస్తున్నారా అనేది చూడాలి. ఆ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత కూడా అత్యాచారాలు పెరుగుతుంటే లేదా దాని ప్రకారం శిక్షలు పడకపోతే అప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాలి. విమర్శలు చేయాలి.
దిశ బిల్లు చట్టమయ్యేవరకు టీడీపీ నాయకులు ఓపిక పట్టాలి. దిశ బిల్లును ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు ప్రశంసించారు. కొందరు బిల్లు తెప్పించుకొని అధ్యయనం చేస్తున్నారు. కేరళ, ఒడిశా, మహారాష్ట్ర ప్రభుత్వాలు బిల్లును తెప్పించుకొని అధ్యయనం చేస్తామని చెప్పాయి.
దిశ చట్టాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలీవాల్ డిమాండ్ చేయడమే కాకుండా, అత్యాచార దోషులకు మరణ శిక్ష విధించాలని నిరాహారదీక్ష చేశారు కూడా. ఈ బిల్లుపై న్యాయవాదులు, న్యాయ నిపుణులు వివిధ మాధ్యమాల్లో చర్చలు జరుపుతున్నారు. సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
కొందరు ఈ చట్టంలో ఉండాల్సిన అంశాలపై సూచనలు చేస్తున్నారు. కాబట్టి చరిత్రాత్మకమైన ఈ బిల్లుపై అప్పుడే విమర్శలు చేయడం మంచిది కాదు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే సహకరిస్తామని ప్రతిపక్షాలు అంటుంటాయి. మరి దిశ బిల్లు చేయడం మంచి పనే కదా. అసెంబ్లీలో బిల్లుకు సహకరించినంతమాత్రాన సరిపోదు.
అది చట్టమయ్యాక దాని అమలును కూడా పరిశీలించాలి. అత్యాచార కేసుల్లో తమ పార్టీల వారున్నా వారు దోషులుగా తేలితే శిక్షించాల్సిందేనని డిమాండ్ చేయాలి. ఎన్ని కఠిన చట్టాలు చేసినా అత్యాచారాలు ఆగకపోవడం మన దురదృష్టమనే చెప్పుకోవాలి.
నిర్భయ చట్టం వచ్చాక అత్యాచారాలు ఆగాయా? ఆగలేదు. రేపు దిశ చట్టం అమల్లోకి వచ్చాక కూడా అత్యాచారాలు ఆగుతాయా? అంటే చెప్పలేం. కాని ఇదో మంచి ప్రయత్నమని చెప్పక తప్పదు. న్యాయ ప్రక్రియలో జాప్యం, దాంట్లో ఉన్న లొసుగులు, రాజకీయ నాయకుల జోక్యం, ప్రభుత్వాల అలసత్వం అత్యాచారాలు ఆగకపోవడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు.
ఏ చట్టమైనా దానంతట అదే పనిచేయదు. దానంతట అదే ఫలితాలు రాబట్టలేదు. చట్టం చేసే ప్రభుత్వమే, సంబంధిత అధికారులే దాన్ని అమలు చేయాలి. కాని అదే జరగడంలేదు. అందుకే చట్టాలు చట్టుబండలు అవడమే కాకుండా, సంపన్నులకు, రాజకీయ నాయకులకు, రాజకీయ పలుకుబడి ఉన్నవారికి చుట్టాలుగా మారుతున్నాయి. అలా కాకుండా ప్రతిపక్షాలు నిఘా పెట్టాలి.