విశాఖకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి జగన్ కి జై కొట్టారు. ఓ వైపు సొంత పార్టీ అధినేత చంద్రబాబు పూనకం వచ్చినట్లుగా ఊగిపోతుంటే తాపీగా గంటా జగన్ విధానం భేష్ అంటున్నారు.
విశాఖను పరిపాలనా రాజధానిగా జగన్ ప్రతిపాదించడం పట్ల గంటా హర్షం వ్యక్తం చేశారు. తన ట్విట్టర్ ద్వారా ఆయన ఈ మేరకు జగన్ కు ఫుల్ సపోర్ట్ ఇచ్చేశారు. విశాఖ విశ్వనగరం కానుందని కూడా గంటా హర్షం వ్యక్తం చేయడం విశేషం.
విశాఖపట్నం అన్ని రకాలుగా ఇపుడు అభివ్రుధ్ధి చెందిందని, రైల్, రోడ్డు, ఎయిర్, వాటర్ కనెక్టివిటీ కలిగిన అతి కొద్ది నగరాల్లో విశాఖ ఒకటని ఆయన అంటున్నారు. అటువంటి విశాఖలో పాలనారాజధాని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పడం అంటే అంతా ఆనందించే విషయమేనని కూడా గంటా అంటున్నారు.
ఈ విషయంలో విశాఖ ప్రజలు కూడా ముఖ్యమంత్రికి తన వంతుగా సాయం అందించడానికి సిధ్ధంగా ఉన్నారని గంటా పేర్కొనడం విశేషం. ఇకపై విశాఖ అంతర్జాతీయ నగరంగా శరవేగంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని కూడా గంటా అంటున్నారు.
మొత్తానికి జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన పిచ్చి తుగ్లక్ నిర్ణయమని ఓ వైపు చంద్రబాబు గగ్గోలు పెడుతూంటే అదే పార్టీకి చెందిన గంటా శ్రీనివాసరావు మాత్రం స్వాగతించడం టీడీపీలో పెద్ద చర్చగా ఉంది. గంటా శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని విషయం తెలిసిందే. మరో వైపు ఆయన టీడీపీకి కాస్తా ఎడం పాటిస్తున్నారు. ఇపుడు జగన్ కి జై అనడంతో పసుపు శిబిరం తల్లడిల్లుతోంది.
మరి ఇదే వరసలో మరెంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు జగన్ నిర్ణయానికి మద్దతు ఇస్తారోనని ఆ పార్టీ కంగారు పడుతోంది. మొత్తానికి జగన్ బాధ ప్రపంచ బాధ అయితే బాబు బాధ మాత్రం సొంత కులం బాధ అని కూడా సెటైర్లు పడుతున్నాయి.