పాపం..దర్శకుడు క్రిష్..ఎరక్కపోయి ఇరుక్కున్నట్లు అయిపోయింది పరిస్థితి. హరి హర వీరమల్లు సినిమా ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికి ఎరుక అన్నట్లు వుంది. ఏ పెద్ద హీరో కూడా ఇలా చేయడు. నాలుగు సినిమాలు ఒకేసారి కొంచెం కొంచెం చేస్తూ వెళ్లడం అన్నది నిజంగా సరైన విధానం కాదు.
హరిహర వీరమల్లు సినిమా సగం పూర్తయింది. మిగిలినది అలా వుంది. ఈ లోగా వినోదయసితం రీమేక్ మీదకు వెళ్లిపోయారు పవన్. ఇరవై రోజులు వర్క్ చేస్తే చాలు. పవన్ పార్ట్ పూర్తయిపోతుంది. అందుకే దాని మీదకు వెళ్లారు. అది పూర్తి కాగానే హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మీదకు వెళ్తారని తెలుస్తోంది.
ఆ సినిమా తరువాత సుజిత్ డైరక్షన్ లోని ఓజి సినిమా చేస్తారేమో? ఇలా చేస్తే ఎప్పటికి రెడీ అయ్యేను పవన్ సినిమాలు. త్రివిక్రమ్ సెట్ చేసిన వినోదయసితం, ఓజి సిన్మాలు త్వరగానే పూర్తి కావచ్చు. కానీ ఆయన హ్యాండ్ లేని హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు మాత్రం అలా పడి వుంటున్నాయి. ఇదేమీ రహస్యం కాదు. ఇండస్ట్రీ అంతా అనుకుంటున్న మాటే. త్రివిక్రమ్ ను పరోక్షంగా క్రిటిసైజ్ చేస్తున్న సంగతే.
సాగినంత కాలం తమంత వారు లేరందురు అన్నట్లు త్రివిక్రమ్ వ్యవహరిస్తున్నారని, తనకు వున్న చనువు వాడుకుని, సినిమాలు సెట్ చేసి, తను డబ్బులు చేసుకుంటూ, అటు హరి హర వీరమల్లు, ఇటు ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్టులకు త్రివిక్రమ్ అన్యాయం చేస్తున్నారని గట్టి విమర్శలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మరో వైపు మహేష్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో గుర్రుగా వున్నారు. త్రివిక్రమ్ తమ హీరో సినిమా వదిలేసి, మిగిలిన పనులు అన్నీ చేస్తున్నారని, సినిమా తేడా కొడుతుందేమో అన్న భయం వ్యక్తం చేస్తున్నారు.
సముద్రఖని డైరక్షన్ లో సినిమా అంటే సరే. కానీ తీరాచేసి పవన్ పట్టుపట్టి త్రివిక్రమ్ ను కూడా సెట్ లో కూర్చోపెడితే అప్పుడు మహేష్ బాబుతో మామూలుగా వుండదు.