అల్లు అరవింద్-అనుభవం పండించుకున్న నిర్మాత. త్రివిక్రమ్ మేధావితనం రంగరించిన మాంచి రచయిత కమ్ దర్శకుడు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఓ సినిమా అభిప్రాయ బేధాలు రాజేసినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం మొత్తం ఇలా వుంది.
అల్లు అరవింద్ నిర్మాణ భాగస్వామిగా, హారిక హాసిని సంస్థతో కలిసి బన్నీ హీరోగా అల వైకుంఠపురములో..సినిమా తయారవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో వారం రోజుల క్రితం అరవింద్, బన్నీవాస్ లు కలిసి సినిమా చూసారు. అప్పటికి సినిమా మూడు గంటల నిడివి వుందని బోగట్టా.
సినిమా అంతా ఓకే కానీ, ఇంత నిడివి వుంటే కష్టమని, తగ్గించాలని, ఎక్కడ తగ్గిస్తే బాగుంటుందో అన్న విషయాలను అల్లు అరవింద్ వివరించినట్లు తెలుస్తోంది. కానీ దీనికి మొదట్లో త్రివిక్రమ్ ససేమిరా అన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో అరవింద్ కు త్రివిక్రమ్ కు మధ్య కాస్త ఇబ్బందికర వాతావరణం ఏర్పడినట్లు బోగట్టా. ఈ సమయంలో బన్నీ కలుగచేసుకుని, ఇరువైపులా సర్దిచెప్పినట్లు ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
ఇదిలా వుంటే అల వైకుంఠపురం నిడివి ప్రస్తుతం రెండు గంటల నలభై నిమషాలకు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులోనే చట్టబద్ద హెచ్చరికలు లాంటి ప్రకటనలు కూడా వుంటాయి. ఈ మేరకు సెన్సారుకు కాపీ లోడ్ చేసినట్లు తెలుస్తోంది. అంటే మొత్తానికి అరవింద్ మాట నెగ్గినట్లే అనుకోవాలి. వినిపిస్తున్న గుసగుసలు నిజమైతే.
అలాగే సినిమాలో ఇంకా ఓపాట చిత్రీకరించాల్సి వుందని తెలుస్తోంది. సెన్సారు కాపీలో చిత్రీకరించాల్సిన ఆ పాట లేదు. ఆ పాటను వేరే సెన్సారు చేయించి యాడ్ చేసే ఉద్దేశంలో వున్నట్లు తెలుస్తోంది. అది యాడ్ చేస్తే నిడివి మరి కొంచెం పెరిగే అవకాశం వుంది.