రాష్ట్ర రాజకీయాల్లో కడపకు ప్రత్యేక స్థానం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్న వైఎస్ కుటుంబానికి అండగా నిలుస్తున్న జిల్లా కడప కావడంతో … అందరి ఫోకస్ ఈ ప్రాంతంపై వుంటోంది.
ఈ జిల్లాలో ఎలాగైనా పాగా వేసి సొంత జిల్లా నుంచే వైఎస్ కుటుంబాన్ని కట్టడి చేయాలనే చంద్రబాబు ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించడం లేదు. తాజాగా కడప పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డిని చంద్రబాబు నియమించారు.
ఇదే భలే విచిత్రంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అసలు ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గానే లింగారెడ్డి పనికి రారని భావించి, కొంత కాలం క్రితం పక్కన పెట్టారు.
లింగారెడ్డి స్థానంలో ఉక్కు ప్రవీణ్‌ను టీడీపీ అధిష్టానం నియమించింది. అలాంటి లింగారెడ్డిని ఏకంగా కడప పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించాల్సి వచ్చిందంటే ఆ పార్టీ పరిస్థితి ఆ జిల్లాలో ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2004లో జరిగిన ఎన్నికల్లో కడప జిల్లాలో కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ సీటును టీడీపీ గెలుచుకొంది. అది కూడా కమలాపురం సీటు. ఇక్కడ డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వర్గాలు ఏకం కావడంతో , కాంగ్రెస్ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2009లో ప్రొద్దుటూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా లింగారెడ్డి గెలు పొందారు.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా సుదీర్ఘ కాలం కొనసాగిన వరదరాజులరెడ్డిపై అసంతృప్తితో ఓటర్లు ఓడించారు. ఆ తర్వాత 2014లో రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా మల్లికార్జునరెడ్డి గెలుపొందారు. 2019లలో కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా టీడీపీ దక్కించుకోలేక పోయింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కడప జిల్లాలో టీడీపీ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. పులివెందులలో వైఎస్ కుటుంబంపై మొదటి నుంచి తలపడుతున్న ఎస్వీ సతీష్‌రెడ్డి, అలాగే జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి పి.రామసుబ్బారెడ్డి, ప్రొద్దుటూరు నుంచి వరదరాజులరెడ్డి టీడీపీని వీడడంతో … అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారినట్టైంది.
ఈ నేపథ్యంలో కడప పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా లింగారెడ్డిని నియమించడం టీడీపీ శ్రేణులకే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా లింగారెడ్డి పనికి రాడని భావించిన అధిష్టానం … ఇప్పుడు ఏకంగా కడప పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించడంలో లోగుట్టు ఏంటో అర్థం కావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి.