ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు వినే వారిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. తెలుగుదేశం వీరాభిమానులను పక్కన పెడితే.. ఇంతకీ చంద్రబాబుకు ఏమైంది? అనే భావన బయటి వారిలో కలుగుతూ ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు పలు సార్లు చాలా అసంబద్ధంగా మాట్లాడారు.
అబద్ధాలను చెప్పారు. అన్నీ తన వల్లనే అని చెప్పుకునే క్రమంలో చంద్రబాబు నాయుడు ఇష్టానుసారం కల్పిత కథలు అల్లారు. తన దగ్గర పని చేయని వాళ్లు పని చేసినట్టుగా చెప్పుకున్నారు! రాజకీయ నేతగా చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేయడానికి రకరకాల అబద్ధాలను చెప్పి ఉండొచ్చు, అయితే అర్థం లేనట్టుగా మాట్లాడటమే అసలు విషయం.
చంద్రబాబు నాయుడుకు ఆల్జీమర్స్ అని అందుకే ఆయన అలా మాట్లాడుతుంటారని కాంగ్రెస్ నేతలు గతంలో వ్యాఖ్యానించారు.
వయసుతో పాటు చంద్రబాబుకు ఆల్జిమర్స్ ముదిరిందని కేవీపీ లాంటి వాళ్లు ఇది వరకూ వ్యాఖ్యానించారు. తాజాగా తిరుపతి పార్లమెంటరీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నేతలతో జూమ్ మీటింగులో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఒక వ్యాఖ్య చేశారట. అదేమిటంటే ఇక నుంచి పార్టీకే అధిక సమయం అంటూ వారికి హామీ ఇచ్చారట!
ఇంతకీ ఈ మాటకు అర్థం ఏమిటి? ఇప్పుడు చంద్రబాబునాయుడుకు పార్టీ తప్ప మరో పని లేదు! గత ఏడాది కాలం పై నుంచినే ఇదే పరిస్థితి. సీఎం హోదాలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇలాగే మాట్లాడారు. ప్రభుత్వానికి అధిక సమయం కేటాయల్సించాల్సి వస్తోందనే తరుణంలో, పార్టీకే అధిక సమయం అంటూ అప్పట్లో పార్టీ నేతలను ఉత్సాహ పరిచేందుకు ఏదో మాట్లాడేవారు.
సీఎంగా ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడితే అదో రకం. కానీ ఇప్పుడు పార్టీకే అధిక సమయం కేటాయించడం అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడటం పట్ల విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రోజులో 24 గంటలూ చంద్రబాబు నాయుడు పార్టీకే అంకితం అయిపోవచ్చని, ఆయనకు ఏ సీఎం బాధ్యతలో ఇప్పుడు లేవని.. బహుశా చంద్రబాబు నాయుడు ఇంకా తను సీఎం అనే భావనలో మునిగి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారేమో అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయిప్పుడు.