విశాఖ ఉక్కు పరిరక్షణకు జనసేనాని పవన్‌కల్యాణ్ మళ్లీ కదిలాడు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రాంగణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఊగిపోయిన పవన్… ఆ తర్వాత ఎట్టకేలకు మరోసారి అదే సమస్యపై ఎట్టకేలకు కార్యాచరణకు దిగారు. విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకోవాలని 300 రోజులుగా కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఈ నెల 12న పవన్‌కల్యాణ్ దీక్షలో కూచోనున్నారు.
ఈ విషయాన్ని పవన్‌కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. పోరాటానికి నైతిక మద్దతు ఇచ్చేందుకే జనసేనాని ముందుకొచ్చినట్టు ఆయన వెల్లడించారు.
మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్‌తో పాటు నాదెండ్ల మనోహర్, పార్టీకి చెందిన నాయకులు కూడా నిరాహార దీక్షలో కూచుంటారని ఆయన వెల్లడించారు. ఆ రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనసేన నాయకులు నిరాహార దీక్షలో కూచొని పోరాటానికి సంఘీభావం ప్రకటించనున్నారు.
ఇదిలా వుండగా విశాఖ బహిరంగ సభలో తమ నేత పవన్‌కల్యాణ్ విశాఖ ఉక్కు పరిరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాధ్యత వహిస్తూ అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీ తీసుకెళ్లాలనే డిమాండ్‌ను పట్టించుకోలేదని విమర్శించారు.
ఎంతో మంది త్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైందని, తెలుగు వారికి ఇది ఒక సెంటిమెంట్ అని ఢిల్లీలో కేంద్రప్రభుత్వ పెద్దలకు తమ నాయకుడు పవన్ వివరించారని ఆయన రాజకీయ కార్యదర్శి గుర్తు చేశారు.
మిత్రపక్షమైన తాను చెప్పినా వినిపించుకోని బీజేపీతో ఇంకా మైత్రీ బంధాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారో జనసేనాని వివరించాలనే డిమాండ్స్ ప్రత్యర్థుల నుంచి వస్తున్నాయి.
ఒకవైపు విశాఖను ప్రైవేటీకరిస్తున్న బీజేపీతో స్నేహం చేస్తూ, మరోవైపు కార్మికులకు సంఘీభావంగా నిరాహార దీక్ష చేపట్టడం ఎంత వరకు నైతికతో జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అంటున్నారు. ఇలాంటి ప్రశ్నలకు మంగళగిరి వేదికగా పవన్ జవాబు చెబితే మంచిది.