విశాఖ లో లోకల్ ఫీలింగ్ గట్టిగా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రతీ అయిదేళ్ళకు ఏదో ఒక జిల్లా నుంచి నాన్ లోకల్స్ విశాఖకు రావడం ఎంపీ అభ్యర్ధులుగా పోటీ చేయడం ఆనవాయితీ అయిపోయింది. ఇందులో కూడా మళ్లీ పోటీ. అదీ ఒకే పార్టీలో సీటు కోసం చిన్న సైజు యుద్ధం. ఇదంతా చూస్తున్న వారికి విశాఖ సీటు మరీ అంతలా అయిపోయిందా అని అనిపించకమానదు.
విశాఖ ఎంపీ అభ్యర్ధిగా బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ముందే కర్చీఫ్ వేసేశారు. ఆయన ఏడాది నుంచి ఇదే పని మీద ఉన్నారు. విశాఖలో ఇల్లు కూడా కొనుక్కుని తాను విశాఖ వాసిని అనిపించుకున్నారు. ఆయన ఏది మాటాడినా ముందూ చివరా విశాఖ ఉండేలా చూసుకుంటున్నారు.
విశాఖ సమస్యల మీద పార్లమెంట్ లో ప్రస్తావిస్తున్నారు. అవి పరిష్కారం అవకపోయినా తాను అడిగినట్లుగా జనంలో రిజిష్టర్ చేసుకుంటున్నారు. జీవీఎల్ ప్రకాశం జిల్లాకు చెందినవారు. ఆయనకు బీజేపీ కేంద్ర పెద్దలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. దాంతో ఆయన విశాఖ సీటుకు అలా ట్రై చేసుకుంటున్నారు.
సీన్ కట్ చేస్తే ఇదే సీటు మీద కేంద్ర మాజీ మంత్రి బీజేపీ లీడర్ దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఆశపడుతున్నారని ప్రచారం సాగుతోంది. ఆమె 2009లో కాంగ్రెస్ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. అలా ఆమెకు విశాఖ మీద కొంత అవగాహన ఉంది.
ఆమె 2019 ఎన్నికల్లో సైతం బీజేపీ అభ్యర్ధిగా విశాఖ నుంచి ఎంపీ స్థానానికి పోటీ పడ్డారు. అందువల్ల మరోసారి తానే విశాఖ ఎంపీ క్యాండిడేట్ అని ఆమె భావిస్తున్నారు. అయితే అనూహ్యంగా మధ్యలో జీవీఎల్ వచ్చేశారు. ఆయన తన దూకుడు పెంచేస్తున్నారు. కేంద్ర పెద్దలు కూడా ఆయన మాట వినే చాన్స్ ఉంది. దాంతో పురంధేశ్వరి సొంత పార్టీ నేత మీదనే సెటైర్లు వేస్తున్నారు అని అంటున్నారు.
జీవీఎల్ అన్ని పేర్లకు ఆ ఇద్దరు నేతలేనా అని ఒక మాట అన్నారు. దాన్ని పట్టుకుని ఎన్టీయార్ వైఎస్సార్ ఇద్దరు కాదు ఆ ఇద్దరూ మహానుభావులు అని పురంధేశ్వరి కౌంటర్ ఇచ్చారు. ఈ మధ్య బీజేపీలో జీవీఎల్ జోరు పెంచడం తో ఆ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి ఉక్కబోతగా ఉంది. ఇపుడు కోరిన సీటు కోసం ఆమె జీవీఎల్ మీదనే ఈ తరహా కామెంట్స్ చేస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.
వీటిని చూసిన వారు ఏమంటున్నారు అంటే బీజేపీకి విశాఖలో సొంతంగా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి ఉందా అని. గెలిచే సీటు కోసం పోటీ పడినా అర్ధం ఉంది. విశాఖ అయినా మరోటి అయినా బీజేపీ గెలుపు అవకాశాలు పెద్దగా ఉండవన్న వారే ఉన్నారు. అయితే ఏదైనా అద్భుతం జరిగి పొత్తులు కుదిరితే మాత్రం జాక్ పాట్ కొట్టినట్లే. అందుకోసమే ఇపుడు విశాఖ ఎంపీ సీటుకు డిమాండ్ బీజేపీలో పెరిగిపోతోంది. కేంద్ర పెద్దల దగ్గర జీవీఎల్ మాట నెగ్గుతుందా, పురంధేశ్వరికి సీటు దక్కుతుందా అన్నది చూడాలి.