పడుకున్న పార్టీని లేపడానికొచ్చిన హీరో

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉందా? సడెన్ గా ఈ ప్రశ్న అడిగితే సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎన్నికల ఫీవర్ ఊపందుకుంది కాబట్టి, మిగిలిన ఒకరిద్దరు ఏదో హంగామా చేసే ప్రయత్నం చేస్తున్నారు…

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉందా? సడెన్ గా ఈ ప్రశ్న అడిగితే సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎన్నికల ఫీవర్ ఊపందుకుంది కాబట్టి, మిగిలిన ఒకరిద్దరు ఏదో హంగామా చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ, కనీసం లోకల్ మీడియా కూడా వాళ్లను పట్టించుకునే పాపాన పోలేదు. ఇక అధిష్టానం సంగతి సరేసరి. వాళ్లు ఏపీని పూర్తిగా మరిచిపోయారు.

ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ను 2 ముక్కలు చేశారో అప్పుడే ఏపీలో కాంగ్రెస్, బీజేపీ భూస్థాపితం అయ్యాయి. భవిష్యత్తులో కూడా అవి కోలుకునే పరిస్థితులు, అంచనాలు కనిపించడం లేదు. ఇలా పడుకున్న పార్టీలోకి ఓ హీరో ఎంటరయ్యాడు. పార్టీని నిద్రలేపుతానంటున్నాడు. అతడే రాజా.

ఆనంద్ సినిమాతో పాపులర్ అయిన ఈ హీరో, తెలుగులో పాతికపైగా సినిమాలు చేశాడు. పదేళ్ల కిందటే ఇండస్ట్రీకి దూరమయ్యాడు. మిషనరీ పనులు, ఛారిటీ లాంటివి చేస్తున్నాడు. ఇప్పుడీ నటుడు ఏపీ కాంగ్రెస్ లోకి ఎంటరయ్యాడు. బెజవాడలో పీసీసీ చీఫ్ రుద్రరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. సేవ చేయడానికే తను పార్టీలోకి వచ్చానంటున్నాడు.

“నాకు రాజకీయాలు కొత్త కాదు. చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నాను. కాకపోతే తెరవెనక పని చేశాను. ఇప్పుడు రాజకీయ ముఖచిత్రంపైకి వచ్చాను. పదవులు నాకు కొత్త కాదు. తెలుగు ప్రజలంతా నాకు హీరో అనే పెద్ద పదవి ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు నన్ను గుర్తుపడతారు. నాకు అది చాలు. పార్టీలో పదవులు నాకు అక్కర్లేదు. పార్టీ కోసం పనిచేస్తాను.”

పదవులు ఆశించి పార్టీలో చేరలేదంటున్నాడు రాజా. తన ప్రాంతం, వేరే ప్రాంతం అనే తేడా లేకుండా అధిష్టానం ఆదేశిస్తే, రాష్ట్రంలో ఎక్కడైనా ప్రచారం చేస్తానంటున్నాడు. మనిషి చూడ్డానికి ఉత్సాహంగానే ఉన్నాడు కానీ, పార్టీ ఎంపికలోనే  అస్సలు బుర్ర వాడలేదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.