ఆళ్ల గెస్ట్ లెక్చ‌ర‌ర్‌…మ‌రి మీ నాన్న‌?

మంగ‌ళ‌గిరి మాన్యాలు ప‌ట్టించిన ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిని తిట్ట‌డానికి ఏమీ లేక‌… ఏదో ఒక‌టి అన్న‌ట్టు నారా లోకేశ్ నోరు పారేసుకున్నారు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో మంగ‌ళ‌గిరి వేదిక‌గా అడుగు పెట్టిన లోకేశ్‌ను వైసీపీ నేత…

మంగ‌ళ‌గిరి మాన్యాలు ప‌ట్టించిన ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిని తిట్ట‌డానికి ఏమీ లేక‌… ఏదో ఒక‌టి అన్న‌ట్టు నారా లోకేశ్ నోరు పారేసుకున్నారు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో మంగ‌ళ‌గిరి వేదిక‌గా అడుగు పెట్టిన లోకేశ్‌ను వైసీపీ నేత ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓడించి, తెలుగు వాళ్ల దృష్టిని త‌న వైపు తిప్పుకున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రి త‌న‌యుడిగా, ఓ మంత్రిగా మంగ‌ళ‌గిరి నుంచి బ‌రిలో నిలిచిన లోకేశ్‌… జ‌గ‌న్ సునామీలో కొట్టుకుపోయారు.

అప్ప‌టి నుంచి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిపై లోకేశ్ అక్క‌సుగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆళ్ల‌పై లోకేశ్ విమ‌ర్శ‌లు గుప్పించ‌డం గ‌మ‌నార్హం. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే.. మంగళగిరి నియోజకవర్గానికి గెస్ట్ లెక్చరర్‌గా మారారని లోకేశ్ విమర్శించారు. వారాని కోసారి వచ్చి ఫొటోలు దిగి జంప్ అయిపోతున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో మంగళగిరిలో అభివృద్ధి శూన్య మని ఆయ‌న మండిప‌డ్డారు.

లోకేష్ గెలిస్తే ఇళ్లు పీకేస్తాడంటూ దుష్ప్రచారం చేసిన ఆర్కే.. ఇప్పుడు పేదవాళ్ల ఇళ్లను కూలగొట్టడం దారుణమని మండిపడ్డారు. మంగళగిరిలో వేలాదిగా వృద్ధాప్య, వితంతు పెన్షన్లు తొలగించారని ఆరోపించారు. రెండుసార్లు గెలిచిన ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి మంగ‌ళ గిరికి గెస్ట్ లెక్చ‌ర‌ర్ అయితే, కుప్పం నుంచి ఆరేడు సార్లు గెలిచి నియోజ‌క‌వ‌ర్గం మొహ‌మే చూడాని త‌న తండ్రి చంద్ర‌బాబును ఏమ‌ని పిల‌వాలో లోకేశే చెబితే బాగుంటుంద‌ని ప్ర‌త్య‌ర్థులు వెట‌క‌రిస్తున్నారు. 

రాజ‌ధాని ప్రాంతంలో పేద‌ల‌కు ఇళ్లు క‌ట్టించి ఇస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ముందుకొస్తే, కోర్టుకెళ్లి అడ్డుకున్న విష‌యాన్ని లోకేశ్ మ‌రిచిపోయారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఎదుటి వాళ్ల‌ను విమ‌ర్శించే ముందు, తమ ఘ‌న కార్యాల గురించి తెలుసుకుంటే మంచిద‌ని ప్ర‌త్య‌ర్థులు లోకేశ్‌కు హిత‌వు చెబుతున్నారు.