విశాఖ నుంచి పాల‌న‌కు జ‌గ‌న్ రెడీ

ఇవాళ నిర్వ‌హించిన ఏపీ కేబినెట్ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇందులో ప్ర‌ధానంగా ద‌స‌రా నుంచి విశాఖ కేంద్రంగా ప‌రిపాల‌న సాగించాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేరకు సీఎంవో కార్య‌క‌లాపాలు విశాఖ నుంచే సాగించేందుకు చ‌ర్య‌లు…

ఇవాళ నిర్వ‌హించిన ఏపీ కేబినెట్ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇందులో ప్ర‌ధానంగా ద‌స‌రా నుంచి విశాఖ కేంద్రంగా ప‌రిపాల‌న సాగించాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేరకు సీఎంవో కార్య‌క‌లాపాలు విశాఖ నుంచే సాగించేందుకు చ‌ర్య‌లు చేపట్టాల‌నే అభిప్రాయానికి వ‌చ్చారు. ఈ మేర‌కు విశాఖ నుంచి పాల‌న చేసేందుకు కావాల్సిన వ‌న‌రుల‌ను స‌మ‌కూర్చుకునేందుకు క‌మిటీని వేయాల‌ని కూడా కేబినెట్ స‌మావేశంలో నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది.

వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా మూడు రాజ‌ధానుల అంశాన్ని తెర‌పైకి తెచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధానిగా నిర్ణ‌యించారు. అయితే మూడు రాజ‌ధానుల బిల్లుల్ని ఏపీ హైకోర్టు కొట్టి వేయడంతో వ్య‌వ‌హారం సుప్రీంకోర్టుకు చేరింది. ప్ర‌స్తుతం మూడు రాజ‌ధానుల అంశం సుప్రీంకోర్టులో వుంది.

ఒక‌వైపు రాజ‌ధానుల అంశం స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానంలో పెండింగ్‌లో వుండ‌గా, మ‌రోవైపు ఇవేవీ కాద‌ని ముందుకెళ్లాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. చిన్న కార్యాల‌యాన్ని కూడా వైజాగ్‌కు త‌ర‌లించేందుకు వీల్లేద‌ని న్యాయ‌స్థానం ఆదేశించిన నేప‌థ్యంలో, ఇప్పుడు కోర్టులో వివాదం న‌డుస్తుండ‌గా, మ‌రోవైపు ఎన్నిక‌ల ముంగిట విశాఖ నుంచి పాల‌న సాగించాల‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డం ఎలాంటి ప‌రిస్థితికి దారి తీస్తుందోన‌న్న ఉత్కంఠ రేపుతోంది.

ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్క‌ర‌ణ కిందికే వ‌స్తుంద‌ని మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా న్యాయ పోరాటం చేస్తున్న పార్టీలు, ప్ర‌జాసంఘాలు అంటున్నాయి. కానీ విశాఖ నుంచి ప‌రిపాల‌న మొద‌లు పెట్ట‌క‌పోతే, ఇటు కోస్తా, అటు ఉత్త‌రాంధ్ర‌లో రాజ‌కీయంగా దెబ్బ‌తినాల్సి వ‌స్తుంద‌నే ఆందోళ‌న వైసీపీలో క‌నిపిస్తోంది. 

కోర్టు ఆదేశాల మేర‌కే విశాఖ నుంచి పాల‌న సాగిస్తామ‌ని ఇంత‌కాలం చెబుతూ వ‌చ్చిన వేసీపీ నేత‌లు, ఇప్పుడు ఏకంగా కేబినెట్‌లో నిర్ణ‌యించ‌డం వెనుక ధైర్యం ఏంట‌నేది అంతుచిక్క‌డం లేదు.