ద‌స‌రా బుల్లోడికి పులి వేషాలు

ANR, ఈ పేరు ఒక అద్భుత జ్ఞాప‌కం. 60-70 మ‌ధ్య పుట్టిన నాలాంటి వాళ్లు అక్కినేని సినిమాలు చూస్తూ పెరిగారు. ఆయ‌న మా కంటే ముందు కాలం హీరో అయినా, సూప‌ర్‌హిట్ సినిమాల క్రేజ్…

ANR, ఈ పేరు ఒక అద్భుత జ్ఞాప‌కం. 60-70 మ‌ధ్య పుట్టిన నాలాంటి వాళ్లు అక్కినేని సినిమాలు చూస్తూ పెరిగారు. ఆయ‌న మా కంటే ముందు కాలం హీరో అయినా, సూప‌ర్‌హిట్ సినిమాల క్రేజ్ క‌ళ్ళ‌తో చూసాను. గుర్తుండి నేను చూసిన మొద‌టి సినిమా ఆత్మీయులు. మొద‌ట్లోనే గుమ్మ‌డి హ‌త్య జ‌రిగితే, నాలుగేళ్ల వ‌య‌సున్న నేను గ‌ట్టిగా కేక‌లు పెట్టేస‌రికి భ‌రించ‌లేక ఇంటికి తీసుకొచ్చారు.

స్కూల్లో NTR గ్రూప్‌కి బ‌లం ఎక్కువ‌. ANR పార్టీకి బ‌లం లేదు. అక్కినేని అర్థం కావాలంటే కొంచెం మెచ్యూరిటీ వుండాలి. నేను చూసిన ANR మొద‌టి అభిమాని మా చిన్నాన్న‌. ఆయ‌న ద‌గ్గ‌ర పోస్టుకార్డ్ సైజ్ ఫొటో వుండేది. With best compliments అని ANR సంత‌కం వుండేది. ఇంగ్లీష్‌లో టైప్ చేసిన చిన్న ఉత్త‌రం. ఇది అక్కినేని స్వ‌యంగా త‌నకు రాశాడ‌ని మా చిన్నాన్న చెప్పుకునేవాడు. అది నిజ‌మ‌ని న‌మ్మి స్కూల్లో అంద‌రికీ చెప్పేవాన్ని. హీరో ANR మా చిన్నాన్న ఫ్రెండ్ కావ‌డం చాలా గ‌ర్వంగా అనిపించేది. ఆ రోజుల్లో హీరోలు ఉత్త‌రాలు రాసి, అభిమానుల‌కి ఫొటోలు పంపేవార‌ని నాకు తెలియ‌దు.

మ‌ద్రాస్ ఎవ‌రైనా వెళ్లార‌ని తెలిస్తే చాలు, నేను అడిగే మొద‌టి ప్ర‌శ్న సినిమా హీరోల్ని చూశారా? అని. ఒక బంధువుని ఇలాగే పీడిస్తే, తాను ANR ఇంటికెళ్లి భోజ‌నం కూడా చేసి వ‌చ్చాన‌ని చెప్పాడు.

రాయ‌దుర్గం నూర్ టూరింగ్ టాకీస్ (టెంట్‌)లో ద‌స‌రా బుల్లోడు వేసిన‌ప్పుడు పిల్ల‌లంద‌రికీ పండ‌గ‌. ఊరంతా డ‌ప్పుల‌తో సినిమా బళ్ల‌ని ఊరేగించారు. అద‌నంగా పులి వేషాలు కూడా. ప్రేమ్‌న‌గ‌ర్‌, బంగారు బాబు సంద‌డి కూడా మామూలుగా లేదు.

అనంత‌పురంలో అక్కినేని అభిమాన సంఘం బ‌లంగా వుండేది. ఎక్కువ మంది కూలీనాలీ చేసుకునేవాళ్లే. శ్రీ‌నివాస్ అనే వ్య‌క్తి స్కూల్లో సెక్యూరిటీ గార్డ్‌గా చేసేవాడు. వ‌చ్చే కాసిన్ని డ‌బ్బుల‌తోనే సంఘానికి ఖ‌ర్చు పెట్టేవాడు. జోగులు అనే వ్య‌క్తి మున్సిపాలిటీలో స్వీప‌ర్‌. కెమికల్స్ త‌గిలి ఆయ‌న చేతుల‌న్నీ బొబ్బ‌లెక్కి వుండేవి. ANR సినిమా రిలీజ్ అయిన‌ప్పుడు డ్యూటీలు ఎగ్గొట్టి చీవాట్లు తినేవాడు. పిల్లికి బిచ్చం పెట్ట‌ని ఒక కిరాణా కొట్టు య‌జ‌మాని ఫ‌స్ట్ మార్నింగ్ షోకి ప‌ది టికెట్లు కొని ఫ్రీగా పంచేవాడు. హోట‌ల్‌లో బాయ్‌గా ప‌ని చేసే ఒక కుర్రాడు రావ‌ణుడే రాముడైతే సినిమా మొద‌టి ఆట‌కి 20 రూపాయ‌ల చిల్ల‌ర నాణేలు తెచ్చి పాట‌పాట‌కి విసిరాడు (ఆ రోజుల్లో క్లాస్ టికెట్ రూ.2.50).

హీరోగా వున్న‌ప్పుడు అక్కినేనిని చూడ‌లేక‌పోయాను. 2000వ సంవ‌త్స‌రంలో తిరుప‌తి వ‌చ్చాడు. మ‌యూరా హోట‌ల్‌లో ప్రెస్‌మీట్‌. జ‌ర్న‌లిస్టుగా వెళ్లాను. ఆ వ‌య‌సులో కూడా ఆయ‌న చ‌లాకీత‌నం ముచ్చ‌టేసింది.

“మ‌నం”లో ANR న‌ట‌న చూసి ఎవ‌రైనా షాక్ కావాల్సిందే. 90+లో కూడా అంత శ‌క్తి ఎలా సాధ్యం? ANR గొప్ప‌త‌నం ఏమంటే మ‌ర‌ణాన్ని కూడా లెక్క చేయ‌క‌పోవ‌డం. క్యాన్స‌ర్ గురించి ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారు. ప్ర‌పంచంలో ఎవ‌రూ ఇలా త‌న మ‌ర‌ణం గురించి ప్ర‌క‌టించ‌లేదేమో!

ANRకి పుట్టుకా లేదు, మ‌ర‌ణ‌మూ లేదు. ఈ భూమికి అతిథిగా వ‌చ్చి వెళ్లారు.

జీఆర్ మ‌హ‌ర్షి