కమ్మవారికి ఇవ్వాల్సిన అవసరం ఉందా?

కులాల సమతూకం, సామాజిక న్యాయం లాంటి పడికట్టు పదాల కోసం కమ్మ సామాజిక వర్గం నుంచి ఎవరో ఒకరిని ఏరి కోరి తెచ్చి వారికి  మంత్రిపదవి కట్టబెట్టాల్సిందే తప్ప.. ఆ వర్గానికి పదవి ఇవ్వడం…

కులాల సమతూకం, సామాజిక న్యాయం లాంటి పడికట్టు పదాల కోసం కమ్మ సామాజిక వర్గం నుంచి ఎవరో ఒకరిని ఏరి కోరి తెచ్చి వారికి  మంత్రిపదవి కట్టబెట్టాల్సిందే తప్ప.. ఆ వర్గానికి పదవి ఇవ్వడం అసలు అవసరమా అనే నిరసన స్వరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తోంది.

జగన్, తార్కిక దఈక్పథం లేకుండా కేవలం కులాలు చూసుకుని కమ్మవారికి ఒక పదవి ఇచ్చినంత మాత్రాన, వాళ్లు తమ పార్టీకి లాయల్టీ చూపిస్తారా? సాధ్యమేనా? అని ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ వాతావరణంలో, ప్రజలందరూ, కనీసం ప్రధాన కులాలైన కమ్మ – రెడ్డి సామాజిక వర్గాలు చాలా స్పష్టంగా తెలుగుదేశం- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు పోలరైజ్ అయి ఉన్న నేపథ్యంలో.. ఎవరో ఒక కమ్మ నాయకుడిని ఏరి తెచ్చి ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కూడా కట్టబెట్టినంత మాత్రాన ఆ వర్గంలో పార్టీ ఆదరణకు ఉపయోగపడుతుందా? అనేది అనేకమంది పార్టీ నాయకుల సందేహం.

కమ్మవారికి మంత్రిపదవి ఇచ్చే బదులుగా, వెనుకబడిన ఎస్సీ ఎస్టీ వర్గాలకు మంత్రి పదవి ఇస్తే.. వారు ఎక్కువ కృతజ్ఞతతో తమ పార్టీకి రుణపడి ఉంటారని కూడా అంటున్నారు. 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మరోమారు మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేయాలని అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈసారి గతంలో మాదిరిగా భారీగా ఉండకపోవచ్చు గానీ.. మహా అయితే ముగ్గురు నలుగురిని తప్పించి కొత్త వారికి, అది కూడా ఇప్పుడు ఎన్నిక కానున్న ఎమ్మెల్సీలకు అవకాశం ఇస్తారనేది పార్టీలో విశ్వసనీయంగా వినిపిస్తున్న సమాచారం. 

కొత్తగా మంత్రివర్గ కూర్పు పూర్తయ్యేసరికి.. కులాల సమీకరణాల దృష్ట్యా సమతూకం ఉండేలా చూస్తారని.. ఎవ్వరూ నిందించే పరిస్థితి రానివ్వరని అంచనాలు సాగుతున్నాయి. ఆ నేపథ్యంలో కమ్మవారికి ఒక  కేబినెట్ బెర్త్ గ్యారంటీ అని, అందుకోసం ఒకరికి ఎమ్మెల్సీ పదవి కూడా దక్కుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఈ పాయింటు దగ్గరే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో కమ్మ సామాజికవర్గం మొత్తం స్పష్టంగా పోలరైజ్ అయి జగన్ ను ద్వేషిస్తూ గడుపుతున్నారని, రాష్ట్రంలోని ప్రజలందరిలో కూడా జగన్ కు వ్యతిరేకంగా విషం నింపడానికి ప్రయత్నిస్తున్నారని, జగన్ వ్యతిరేక పోరాటాలు చేసే వారికి ఫండింగ్ చేస్తున్నారని ఇలాంటి నేపథ్యంలో.. ఆ కులాన్ని తృప్తి పరచగలం అనే నమ్మకం జగన్ కు ఉందా అని వారు ప్రశ్నిస్తున్నారు.

ఎవరో ఒకరిని ఎంచుకుని వారికి మంత్రిపదవి ఇచ్చినా సరే.. కులం సంతృప్తి చెందడం జరగదని, దానికి బదులుగా వెనుకబడిన, నిమ్న కులాలనుంచి సమర్థలను ఎంపిక చేసి మంత్రి పదవి ఇస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని నిజాయితీగా పనిచేస్తారని కూడా హితవు చెబుతున్నారు.

గతంలో కొడాలి నానికి ఇచ్చినందువలన.. ఆయన అనుచరుల్లో తప్ప రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గంలో పార్టీకి దక్కిన ఆదరణేమీ లేదని అంటూనే.. కులాల లెక్క కోసం వారిని నెత్తిన పెట్టుకోవడం తగదని అంటున్నారు.