అప్పుడెప్పుడో చంద్రబాబు తన మామ ఎన్.టి.ఆర్ నుంచి పార్టీ లాక్కుంటే దానిని వెన్నుపోటన్నాం. నిజమే మరి. ఉన్న పార్టీ నచ్చకపోయినా, అధినేత విధానాలు బాలేదనుకున్నా మద్దతుదార్లని కూడగట్టుకుని వేరే పార్టీ పెట్టుకోవడమో, అంత ఓపిక లేకపోతే కనీసం నచ్చిన వేరే పార్టీలోకి చేరిపోవడమో చెయ్యాలి. అంతే కానీ ఉన్న పార్టీ అధినేతని పడగొట్టి పార్టీని లాగేసుకోవడమేంటి అని అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ చంద్రబాబుని చరిత్ర ప్రశ్నిస్తూనే ఉంది.
నిజమే కదా. మనకి కంపెనీ హెడ్ అయిన బాస్ నచ్చకపోతే వేరే కంపెనీ చూసుకోవడం పద్ధతా, లేక ఆ బాస్ ని పడకొట్టేసి కంపెనీని లాగేసుకోవడం కరెక్టా?
ఆ మధ్యన జగన్ మోహన్ రెడ్డికి సోనియా గాంధితో విభేదమొస్తే తెగించి సొంత పార్టీ పెట్టుకున్నాడు. పోరాడాడు, ప్రజాబలంతో గెలిచాడు. అందులో చరిత్రకి మచ్చ తెచ్చే పనేమీ లేదు. పైగా అదంతా గొప్పచరిత్రగా చెప్పుకోవడానికి ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా శివసేన పార్టీ పేరు, గుర్తు రెండూ ఎలక్షన్ కమీషన్ చలవవల్ల ఏక్నాథ్ షిండే వశమైపోయాయి. ఆ కథేంటో టూకీగా చూద్దాం.
శివసేన బాల్ థాక్రే పెట్టిన పార్టీ. అతని తనయుడు ఉద్ధవ్ థాకరే మహారాష్ట్రకి 19వ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. అంతర్గత తగాదాలతో షిండే అధికశాతం ఎమ్మెల్యేల మద్దతు మూటగట్టుకుని ఉద్ధవ్ ని పడగొట్టి 2022లో తాను సీయం అయిపోయాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ బలం, బలగం తనకే ఉంది కనుక శివసేన పార్టీకూడా తనదే అని పేచీపెట్టాడు. కొంతకాలంగా ఈ రచ్చ జరుగుతోంది. ఇదంతా అయ్యే పని కాదని, ఇదేమైనా చంద్రబాబు ఎన్.టి.ఆర్ కి వెన్నుపోటు పొడిచిన కాలమా అనుకుంటూ ఉన్నారు రాజకీయ విశ్లేషకులు.
కానీ పిడుగుపడినట్టు జరగదనుకున్నది జరిగిపోయింది. ఎలక్షన్ కమీషన్ షిండే కోరిక తీర్చేసింది. పార్టీ, గుర్తు..రెండూ షిండేకే చెందుతాయని తేల్చేసింది. అంటే ఇది అధికారిక వెన్నుపోటన్నమాట.
ఇప్పుడు శివసేనకి థాక్రే వంశానికి ఇక సంబంధం లేదన్నమాట. కావాలంటే ఉద్ధవ్ వేరే పార్టీ పెట్టుకోవాలంతే. లేదా మరొక పార్టీలోకి దూరాలి. రెండూ కాదంటే సన్యాసం పుచ్చుకుని ఇంట్లో కూర్చోవాలి. ఇదీ పరిస్థితి.
తెలుగు రాజకీయ చరిత్రలో వెన్నుపోటు గురించి చెప్పుకునీ చెప్పుకునీ విసిగిపోయిన వారు తాజాగా మహారాష్ట్రలోని ఈ ఎదురుపోటు గురించి చెప్పుకోవాలి. మరీ ఇంత అన్యాయమా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ 'లా' లో లొసుగులు అనేకం. వాటిని అడ్డం పెట్టుకుని పోరాడే క్రమంలో ఏలిన వారి అభయం ఉంటే చాలు..కోరుకున్నది “పువ్వులో” పెట్టి ఇప్పిస్తారు.
ధర్మమీమాంసకి, న్యాయశాస్త్రానికి చాలా తేడా ఉందనిపిస్తుంది. నడిపే వాడిదే న్యాయం. దమ్మున్నవాడిదే ధర్మం. అంతే!
శ్రీనివాసమూర్తి