ప్రతి యేడాదీ క్వింటాల్ ఉల్లి 300 నుంచి 500 రూపాయల వరకూ పలికేదని.. ఈ ఏడాది క్వింటా ఉల్లిపాయలను 15 వేల రూపాయలకు అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయని రైతులు ముసిముసి నవ్వులతో చెబుతూ ఉన్నారు. మన సైడ్ వర్షాధార పంటగానే ఎక్కువగా ఉల్లిని సాగుచేస్తూ ఉన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతంతో మొదలుపెడితే.. కర్నూలు, కర్ణాటకలోని తెలుగు మాట్లాడే బళ్లారి ప్రాంతాల నుంచి కర్నూలుతో సరిహద్దును పంచుకునే కర్ణాటక ప్రాంతంలో ఎక్కువగా ఉల్లిపాయల సాగు ఉంది. మిగతా ప్రాంతంలోనూ ఉల్లి సాగు చేస్తున్నా.. ప్రతియేటా క్రమం తప్పకుండా ఉల్లిపాయలను సాగు చేసే ప్రాంతాలు పరిమితమే.
అలాంటి రైతుల పంట ఈ ఏడాది పండింది. ఉల్లి ధరలు పతాక స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంతో పోలిస్తే ఉల్లి రైతులకు అనేక రెట్ల ఎక్కువ ధర దక్కింది. క్వింటా ఉల్లిపాయలు మూడు వందల రూపాయలు అమ్మడమే ప్రతియేటా జరిగేదని రైతులు చెబుతున్నారు. అంటే కిలో మూడు రూపాయలు. అలాంటిది ఈ సారి ఒక సందర్భంలో క్వింటా ఉల్లి పదహైదు వేల రూపాయలు పలికిందని రైతులే చెబుతున్నారు. అంటే కిలో నూటా యాభై రూపాయలు!
మూడు రూపాయలు కిలో ఎక్కడ.. నూటా యాభై కిలో ఎక్కడ! దీంతో రైతులకు లాభాలు ఘనంగా లభించాయి. కొంతమంది రైతులు చెప్పిన దాని ప్రకారం… ఎకరా ఉల్లి సాగు చేసి అన్నీపోనూ రెండు మూడు లక్షల రూపాయలు మిగిలిన దాఖలాలు కూడా ఉన్నాయట. ఇప్పుడు కూడా ఉల్లి ధరలు తగ్గింది లేదు. ప్రస్తుతానికి కొన్ని క్వింటా ఉల్లి పదివేల రూపాయల వరకూ ఉందట! కనిష్టంగా ఆరు వేల రూపాయలకు అమ్మారట ఈ సీజన్లో. ఇలా రైతులు మంచి లాభాలు చూశారు.
ఉల్లిధరల వల్ల మధ్యతరగతి కొంచెం ఇబ్బంది పడింది వాస్తవమే కానీ, ప్రతియేటా నష్టాలు, పెట్టుబడులు రాబట్టుకోవడమే తప్ప మరోటి తెలియని రైతులకు ఇలా ఒక సంవత్సరం మంచి లాభాలు రావడం ఆహ్వానించదగిన అంశమే. ఒక కుటుంబం అంతా వారానికి కిలో ఉల్లిపాయలతో సర్దుకోవచ్చు. అలాంటప్పుడు.. కిలో ఉల్లి వంద రూపాయలను పెట్టి కొన్నా తప్పు ఏమీ లేదు.
అలా కుదరదు అనుకుంటే.. ఉల్లి తినడం మానేయనూ వచ్చు. ఆదివారం వస్తే ఐదు వందల రూపాయలు తెచ్చి కిలో మటన్ తెచ్చుకుని, ఒక పూటకు తింటారు. అయితే వారానికి సరిపడ ఉల్లికి వంద రూపాయలు అంటే..మరీ ఓవర్ గా రియాక్ట్ అయిపోతూ ఉన్నారు. ఇదే రైతులు గిట్టుబాటు ధర లేక పండించిన పంటను పారేసి వెళ్లిపోతే పట్టించుకునే నాథుడు ఉండడు. ఉల్లి వంద అంటే.. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక ఉల్లిపై రాజకీయానికీ హద్దు లేదు. రైతులు బాగుపడుతూ ఉంటే.. ప్రతిపక్షాల వాళ్లు తట్టుకోలేకపోతూ ఉన్నారు.