ఆంధ్రప్రదేశ్‌లో కాపు నేతలకున్న డిమాండ్, మిగిలిన సామాజిక వర్గాలకు లేదనే చెప్పాలి. తాజాగా కన్నా లక్ష్మీనారాయణే నిలువెత్తు నిదర్శనం. ఈయన కాపు సామాజికవర్గానికి చెందిన నేత. ఈయన కోసం పాలక ప్రతిపక్ష పార్టీలన్నీ వెంపర్లాడు తున్నాయి. గతంలో కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రాత్రికి రాత్రి రాజకీయాలు చకచకా మారిపోయాయి. ఢిల్లీ నుంచి అమిత్‌షా నుంచి ఫోన్ రావడంతో బీజేపీలోనే కన్నా లక్ష్మీనారాయణ కొనసాగారు. ఆ తర్వాత ఏపీ బీజేపీ చీఫ్ అయ్యారు. ఇప్పుడు ఆయన ఆ పార్టీ నుంచి బయటికొచ్చారు.
ఆయన కోసం జనసేన ప్రయత్నించింది. చివరికి టీడీపీలో కన్నా చేరేందుకు సిద్ధమయ్యారని సమాచారం. పదేళ్లుగా ఎలాంటి చట్టసభలకు ప్రాతినిథ్యం వహించని కన్నా కోసం వైసీపీ, టీడీపీ, జనసేన ప్రయత్నించడాన్ని గమనించొచ్చు. కానీ రెండో దఫా ఎమ్మెల్యేగా ఎన్నికైన నెల్లూరు రూరల్ ప్రజాప్రతినిధి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కోసం ఎందుకని ఎవరూ ప్రయత్నించలేదన్నది చర్చనీయాంశమైంది.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సిగ్గు విడిచి మరీ టీడీపీ నుంచి పోటీ చేయాలనే ఆకాంక్షను బహిరంగంగా వెల్లడించారు. కానీ ఆయనతో ఏ ఒక్క టీడీపీ నాయకుడు మాట్లాడ్డం లేదు. చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నా కోటంరెడ్డిని ఎవరూ ఎందుకు పట్టించుకోవడం లేదనేది చర్చనీయాంశమైంది. కోటంరెడ్డి మనసులో చంద్రబాబు ఉన్నారని తెలియడంతో జనసేన, బీజేపీ నేతలు కూడా టచ్ చేయలేదని సమాచారం.
ఏపీ రాజకీయాల్లో కులాలకు ఉన్న ప్రాధాన్యం ఏంటో కన్నా, కోటంరెడ్డి ఉదంతాలే నిదర్శనం. టీడీపీ తరపున పోటీ చేయాలని ఉంది మహాప్రభో అని కోటంరెడ్డి నెత్తీనోరూ కొట్టుకుంటూ చెబుతున్నా… పట్టించుకునే దిక్కులేదు. ఇదే కన్నా విషయానికి వస్తే… భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని అంటున్నారు. అయినప్పటికీ ఆయన తమ పార్టీలోకి వస్తే బాగుంటుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఏపీలో కాపులు అధికారాన్ని శాసించే స్థితిలో ఉండడమే కారణం.