ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. తనను టార్గెట్ చేస్తూ ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర ఆరోపణలు చేసినా, వాటిపై మాట్లాడకూడదని సోము వీర్రాజు నిర్ణయించుకోవడం విశేషం. తద్వారా కన్నాకు అంత సీన్ లేదని చెప్పడమే సోము వ్యూహమని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.
బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ గురువారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోము వీర్రాజు ఒంటెత్తు పోకడలే తన రాజీనామాకు కారణమని ఆయన చెప్పారు. బీజేపీని ఒక రాజకీయ పార్టీలా కాకుండా, వ్యక్తిగత సంస్థగా నడుపుతు న్నాడని కన్నా తీవ్ర ఆరోపణలు చేశారు. మోదీ నాయకత్వంపై అభిమానం ఉన్నప్పటికీ, రాష్ట్ర నాయకత్వ వ్యవహారశైలితో విసిగిపోయానని, ఆ పార్టీలో ఇమడలేకే బయటికి వెళుతున్నట్టు కన్నా చెప్పిన సంగతి తెలిసిందే.
బాపట్ల జిల్లా పర్యటనలో ఉన్న సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. కన్నా ఆరోపణలపై ఆయన స్పందిస్తూ… గతంలో కూడా తనపై ఇలాగే మాట్లాడారని గుర్తు చేశారు. అప్పుడు స్పందించలేదన్నారు. ఇప్పుడు కూడా స్పందించనన్నారు. 1978 నుంచి తాను బీజేపీలో ఉన్నానన్నారు. తన గురించి పార్టీ పెద్దలకు బాగా తెలుసన్నారు.
బీజేపీ-జనసేన కూటమి రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడవాలంటే బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం వుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలకు 60 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తోందన్నారు.