గతంలో హైదరాబాద్ అత్తాపూర్ ప్రాంతంలో నడిరోడ్డుపై జరిగిన హత్యను మరిచిపోకముందే, మరో దారుణ హత్యకు కేంద్రంగా మారింది భాగ్యనగరం.నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉంటే బంజారాహిల్స్ ప్రాంతంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు కొందరు దుండగులు.
బంజారాహిల్స్ లోని ఎన్బీటీ నగర్ లో రాత్రి జరిగిన ఈ హత్య సంచలనంగా మారింది. ఎన్బీటీ నగర్ నుంచి గోల్కొండ వైపు వెళ్తున్న నూర్ సయ్యద్ అనే వ్యక్తిపై హఠాత్తుగా దుండగులు దాడిచేశారు. ఆటోలో వచ్చిన నలుగురు వ్యక్తులు, ఒక్కసారిగా నూర్ పై విరుచుకుపడ్డారు. కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు.
తీవ్ర గాయలతో, రక్తసిక్తమైన సయ్యద్.. అక్కడికక్కడే మరణించాడు. అతడి మెడ, ఛాతిపై తీవ్ర గాయాలయ్యాయి. సయ్యద్ ను చంపిన వెంటనే నలుగురు దుండగులు, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వాళ్ల వద్ద నుంచి ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒక కత్తి సగానికి విరిగిపోయింది.
హైదరాబాద్ లో కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు ఈరోజు ఓ ప్రకటన చేయబోతున్నారు. హత్యకు గురైన నూర్ సయ్యద్ ను రౌడీ షీటర్ గా గుర్తించారు పోలీసులు. పాత కక్షలే దీనికి కారణమని ప్రాధమికంగా నిర్థారణకు వచ్చారు.