‘కమ్మ సామాజిక వర్గంపై ద్వేషాన్ని పెంచుకున్న జగన్ అండ్ కో ఇప్పుడు ఆ సామాజిక వర్గం వారిపట్ల ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదో అందరికీ తెలిసిందే! ఎన్నికలకు ముందునుంచే ఒక పకడ్బందీ ప్రణాళిక ప్రకారం కమ్మ సామాజికవర్గంపై ఇతర సామాజిక వర్గాలలో ద్వేష భావాన్ని రగిలించి రాజకీయ ప్రయోజనం పొందింది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నది సత్యం కాదా? ’…ఈ వాక్యాలు గత నెలలో ‘వికృత చేష్టలు… గురివింద నీతులు’ శీర్షికతో రాసిన కొత్తపలుకులోనివి.
ఇదే వ్యాసంలో ఆయన ఇంకా ఏమంటారంటే…‘నిజామాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామంలో పుట్టిన నాకు ఏపీలో నెలకొన్న కులాల కుళ్లు గురించి గతంలో తెలిసేది కాదు. కులగజ్జికి దూరంగా పెరిగినవాడిని!’. ఈ వ్యాస రచయిత వేమూరి రాధాకృష్ణ. ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ. గతంలో కులాల కుళ్లు తెలిసేది కాదు అంటే ఇప్పుడు తెలుసన్న మాట. కులగుజ్జికి దూరంగా పెరిగాడంటున్న ఆయనకు ఒళ్లంతా కులగుజ్జి ఉందని నేరుగా రాధాకృష్ణ (కమ్మ సామాజిక వర్గం)నే ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సినీనటుడు మోహన్‌బాబు ప్రశ్నించడం సోషల్ మీడియాలో వైరం అయిన విషయం తెలిసిందే.
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను దెబ్బతీసేందుకు అన్ని రకాల ప్రయత్నాలను ఆర్‌కే చేస్తున్నారనేందుకు అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. జగన్‌పై ఇతర కులాల్లో ఆర్‌కే మాటల్లో చెప్పాలంటే ద్వేషభావన పెంచి దెబ్బతీయాలని తన పత్రికలో రెడ్డి సామాజికవర్గంపై విషం కక్కుతూ వార్తలను ప్రచురిస్తున్నారు. ఒక్కసారి గురువారం మెయిన్‌పేజీలో కమ్మపత్రికలో ప్రచురితమైన రెడ్ల వార్తల గురించి తెలుసుకొందాం.
రెడ్డి కాబట్టే ఇలాగా?
ఒకరెడ్డి(దిశ)ని చంపిన నలుగురిని ఎన్‌కౌంటర్ చేసినప్పుడు …నలుగురు మహిళల్ని చంపిన మరో రెడ్డికి అదే శిక్ష ఎందుకు వేయరని ఎమ్మార్పీఎస్ వ్మవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హాజీపూర్‌లో ముగ్గురు బాలికలపై అత్యాచారం, హత్య చేసిన శ్రీనివాసరెడ్డిని, జడ్చర్లలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపిన నవీన్‌రెడ్డిని ఎన్‌కౌంటర్ చేయాలని సూచించే సాహసం జగన్ చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. ఈ వార్తకు శీర్షిక రెడ్డి కాబట్టి ఇలాగా?
ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో సమర్థులే లేరా?
బంధుప్రీతి, సామాజికవర్గ (రెడ్డి) ప్రీతితో ప్రభుత్వ సలహాదారుల పోస్టులు నింపేశారని అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించాడు. 75 మందికి నామినేటెడ్ పదవులు ఇస్తే …అందులో ఒకే సామాజిక (రెడ్డి) వర్గానికి పెద్దపీట ఎలా వేస్తారని ఆయన ప్రశ్నించాడు. ఈ వార్తకు శీర్షిక…ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో సమర్థులే లేరా?
రెడ్డి రాజ్యంలో కక్షపాలన
రాంగోపాల్‌వర్మ తన సినిమాకి రెడ్డిరాజ్యంలో కక్షపాలన అనే టైటిల్ పెడితే బాగుంటుందని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సూచించారు. చంద్రబాబుకు గుండె లేదని, ఆయన రాజ్యంలో కమ్మవారంతా కృష్ణా, గోదావరిలో కలిసిపోయారన్నారు. ఈ వార్తా శీర్షిక …రెడ్డిరాజ్యంలో కక్షపాలన.
రిజర్వేషన్ల ముసుగులో రెడ్లకే పట్టంః టీడీపీ
50 శాతం రిజర్వేషన్లంటూ మాయమాటలు చెబుతున్న జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం , ఆ ముసుగులో ప్రాధాన్యం లేని పదవుల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చి, లక్షల కొద్ది జీతాలు ప్రాధాన్యతా స్థానాలను మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టిందని టీడీపీ ఎమ్మెల్యేలు మద్దాలిగిరి, డోలా బాలవీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వారు లోకేశ్వరరెడ్డి (ఆర్టీజీఎస్ సీఈఓ), తిరుమలరెడ్డి (డీజీపీ పీఆర్వో), సజ్జల రామకృష్ణారెడ్డి (రాష్ట్రప్రభుత్వ సలహాదారుడు), చల్లా మధుసూదన్‌రెడ్డి (స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్)ల పేర్లను ఉదహరించారు. అలాగే వైసీపీ ప్రభుత్వం రాష్ర్టంలో రెడ్ల రాజ్యాన్ని నడుపుతోందని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ వార్తకు శీర్షిక…రిజర్వేషన్ల ముసుగులో రెడ్లకే పట్టంః టీడీపీ. ఈ వార్తలు ఆర్‌కే కులస్పృహకు నిదర్శనం కాక మరేంటి?