విఆర్ఎస్ తర్వాత సోమేశ్ కు కీలక పదవి!

'రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా?' అని సామెత. అలాంటిది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తలచుకుంటే, అయినవారిని అందలాల మీద కూర్చోబెట్టడంలో అడ్డం ఏం ఉంటుంది? చట్టపరమైన నిబంధనలు, నియమాలు ఇలాంటివి ఏవీ కొందరు పెద్దలకు…

'రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా?' అని సామెత. అలాంటిది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తలచుకుంటే, అయినవారిని అందలాల మీద కూర్చోబెట్టడంలో అడ్డం ఏం ఉంటుంది? చట్టపరమైన నిబంధనలు, నియమాలు ఇలాంటివి ఏవీ కొందరు పెద్దలకు ఏమాత్రం అడ్డు రావు. వారు తమకు తోచిన రీతిలోనే ఎప్పటికీ చెలరేగుతూ ఉంటారు. రాజకీయ నాయకుల ప్రాపకం సంపాదిస్తే చాలు కొందరికి ఎప్పటికీ పదవులపరంగా పరమ వైభవ స్థితి కొనసాగుతూనే ఉంటుంది!.

తాజా పరిణామాలను గమనిస్తే తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఉదంతం పెద్ద నిదర్శనం! ఆయన కేసీఆర్ కు అత్యంత ప్రీతిపాత్రమైన ఐఏఎస్ అధికారులలో ఒకరు. తెలంగాణ ఉద్యమ సమయంలోను ఒక సీనియర్ అధికారిగా తాను చేయగలిగిన సాయం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాదులో స్థిరపడిన సీమాంధ్రులను భయానికి గురి చేయడంలో తన వంతు పాత్ర పోషించారు. సీమాంధ్రుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందనిపించే ప్రదేశాలలో అపార్ట్మెంట్లు ఇంటి నిర్మాణాల నిబంధనలను హఠాత్తుగా తెరపైకి తెచ్చి అడ్డగోలుగా కూల్చివేతలకు కూడా పాల్పడ్డారు. జిహెచ్ఎంసి కమిషనర్ గా కోర్టు అక్షింతలు వేసే వరకు ఒక విధ్వంస కాండను నడిపించారు. ఆయన సేవలను మెచ్చి, ప్రభుత్వ ప్రధాని కార్యదర్శిగా ఆయనను అందలం మీద కూర్చోబెట్టారు కేసీఆర్.

అయితే ఆయన ఉద్యోగ బాధ్యతలలోనే ఒక మతలబు రహస్యంగా ఉండిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ ను ఏపీ సర్వీసులకు కేటాయించారు. అయితే ఆంధ్రప్రదేశ్ సేవకు వెళ్లడం ఇష్టం లేని సోమేష్ కుమార్ ట్రిబ్యునల్ లో కేసు నడుపుతూ తెలంగాణలోనే కొనసాగుతూ వచ్చారు. ఇటీవలే ఆ కేసు తెమిలిపోయింది. సోమేశ్ కుమార్ ఏపీ సర్వీస్ కు వెళ్లి జాయిన్ కావలసిందే అని విస్పష్టమైన తీర్పు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఆయనను తక్షణం రిలీజ్ చేసింది. మరునాడు ఏపీలో రిపోర్ట్ చేసిన ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ కు అక్కడి ప్రభుత్వం ఏ పోస్టును ఇన్నాళ్లుగా కేటాయించలేదు.

ఒక రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అత్యున్నత స్థాయిలో బాధ్యతలను నిర్వర్తించిన తర్వాత, మరో రాష్ట్రంలో స్థాయి తక్కువ గల పదవులు నిర్వహించాలంటే ఎవరికైనా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆ పరిస్థితుల్లో సోమేశ్ కుమార్ తాజాగా స్వచ్ఛంద పదవి విరమణ కోసం ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఆ దరఖాస్తు ఆమోదించింది కూడా. నేడోపోరేపో ఆయన రిటైర్మెంట్ ప్రకటన వెలువడుతుందని అంచనా వేస్తున్నారు.

అయితే విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ఏంటంటే సోమేశ్ కుమార్ ఏపీ సర్వీసుల నుంచి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆయనకు తెలంగాణ ప్రభుత్వం లో కీలకమైన పదవిని కట్టబెట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. క్యాబినెట్ హోదా ఉండేలాగా కీలకమైన ప్రభుత్వ సలహాదారు పదవిలో తెలంగాణలో సోమేశ్ కుమార్ ఇకపై సేవలు అందించే అవకాశం ఉంది. 

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అని అన్నట్లుగా. ప్రభుత్వ నియమాలు విభజన చట్టం ద్వారా జరిగిన పంపకాలు సోమేశ్ కుమార్ ను పూర్తిగా ఏపీ పరిధిలోకి తీసుకువెళ్లేయి. ఏపీకి వెళ్లకుండా తెలంగాణలోనే కొనసాగిన ఫలితంగా ఆయన చీఫ్ సెక్రటరీ అయ్యారు కానీ.. చివరి అంకం సమీపించేసరికి ఆయన ఒక మామూలు ఐఏఎస్ అధికారిగా ఏపీకి వెళ్లవలసి వచ్చింది. ఈ పరాభవం తట్టుకోలేకనే ఆయన విఆర్ఎస్ తీసుకుంటున్నట్లుగా సమాచారం!

ఎటు తనకు నమ్మకస్తుడు, రాజకీయ వ్యూహ ప్రతి వ్యూహాల రచన అమలులో పరిజ్ఞానం ఉన్నవాడు అయిన సోమేశ్ కుమార్ ను సలహాదారు పదవిలో కూర్చోబెడితే తనకు బాగా ఉపయోగపడగలరని కేసీఆర్ అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది.