ఒక వైపు మీటింగ్ మరో వైపు షూటింగ్ అంటూ మహా కవి శ్రీశ్రీ సాయం సంధ్యా కవితను ఆ ఏంపీ గారు పాడుకుంటున్నారు. రెండూ ఇంపార్టెంటే. అటు పార్టీ మీటింగులు ఉన్నాయి. ఇటు షూటింగులు ఉన్నాయి. ఎలా బాలన్స్ చేయడం అంటే ఆ ట్రిక్కేదో ఆయనకు బాగా తెలుసట.
అందుకే ఎంచక్క షూటింగుకు అటెండ్ అయిపోయారు. ఆయనే విశాఖ ఎంపీ ఎంవీసీ సత్యనారాయణ. ఆయన సినీ నిర్మాత కూడా. 2019 ఎన్నికల్లో గెలిచినా ఆయన కొన్ని సినిమాలు తీస్తూ ఉన్నారు. అలాగే తనలోని నటుడిని సంతృప్తి పరుస్తూనే ఉన్నారు. ఆ మధ్యన అల్లూరి మీద తీసిన సినిమాలో ఆయన బ్రిటిష్ అధికారిగా ముఖ్య పాత్ర పోషించారు.
ఇపుడు టాలీవుడ్ దర్శకుడు వీరభద్రం తీస్తున్న కొత్త చిత్రం లో ఆయన నటిస్తున్నారు. ఒకనాటి కామెడీ స్టార్ రాజేంద్ర ప్రసాద్ తో కలసి ఆయన స్క్రీన్ ని పంచుకుంటున్నారు. విశాఖలోనే ఈ షూటింగ్ జరగడంతో ఎంపీ గారికి బాగా వెసులుబాటుగా ఉంది అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో విశాఖలోని ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఎంవీవీ సత్యనారాయణ రాజకీయంగానూ బిజీగా గడుపుతున్నారు. వైసీపీ అధినాయకత్వానికి సన్నిహితుడిగా ముద్ర పడిన ఆయన బిల్డర్ గా ప్రొడ్యూసర్ గా నటుడిగా, పొలిటీషియన్ గా బహుముఖమైన పాత్రను పోషిస్తున్నారు.