బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న విష్ణు కుమార్ రాజు గారికి వైసీపీ మాత్రమే టార్గెట్ గా ఉంది. ఆయన పార్టీ ప్రెసిడెంట్ సోము వీర్రాజుకు కానీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు కానీ వైసీపీతో పాటు టీడీపీ కూడా టార్గెట్ గానే ఉన్నాయి. రెండు పార్టీలను కలిపి వారు విమర్శిస్తారు.
కానీ రాజు గారు మాత్రం వైసీపీ మీదనే గురి పెట్టారు. ఏపీకి పట్టిన చీడ వైసీపీ అని ఆయన అంటున్నారు. ఒక్క చాన్స్ ఇస్తే జనాలకు బుద్ధి వచ్చిందంట. నిరాహార దీక్షలు సంవత్సరం చేసినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అమరావతి రైతులు ఎన్ని రోజులు దీక్షలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
అదానీకి జగన్ దోచి పెడుతున్నారుట. మరి ఆదానీకి కేంద్రం దోచిపెడుతోందని విపక్షాలు పార్లమెంట్ వద్ద గగ్గోలు పెడుతున్న సంగతిని రాజు గారు మరచారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ ఓడిపోతుందట. ఇలా చాలా జోస్యాలు చెప్పిన ఆయన ఏపీలో తమ సొంత పార్టీ బీజేపీ అధికారంలోకి వస్తుందని మాత్రం ఎందుకో చెప్పలేకపోతున్నారు అని అంటున్నారు.
ఏపీ అప్పుల కుప్ప అంటున్నారు. కేంద్రం చేసిన అప్పులు గురించి కూడా మాట్లాడాలి కదా అని ప్రత్యర్ధులు అడుగుతున్నారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో స్వర్ణ యుగం అన్నట్లుగా ఆ ప్రభుత్వాన్ని కూడా ఏమీ అనడంలేదు అన్న విమర్శలు వైసీపీ నుంచే వస్తున్నాయి.
రాజు గారి తీరు ఇలా ఉండబట్టే వైసీపీకి చెందిన విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇంచార్జి కేకే రాజు ఇంతకీ మీరు ఏ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు సూటిగా చెప్పండి అని అడిగేశారు. బీజేపీ నుంచి పోటీ చేస్తాను అని చెప్పగలరా అని కూడా అంటున్నారు. అయినా రాజు గారు మాత్రం వైసీపీని మాత్రమే విమర్శిస్తూ తన ఆప్షన్లు తాను ఉంచుకున్నారు అని అంటున్నారు.