రాజేంద‌ర్ క‌బ్జా భూమి ఎంతంటే….

టీఆర్ఎస్ నుంచి ఈట‌ల రాజేంద‌ర్ గెంటివేత ప్ర‌కంప‌న‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈట‌ల‌పై కేసీఆర్ స‌ర్కార్ ప‌గ ప‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే అభిప్రాయాలు మొద‌టి రోజు నుంచే వెల్లువెత్తుతూనే వున్నాయి. మంత్రి ప‌ద‌వికి ఈట‌ల రాజీనామా…

టీఆర్ఎస్ నుంచి ఈట‌ల రాజేంద‌ర్ గెంటివేత ప్ర‌కంప‌న‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈట‌ల‌పై కేసీఆర్ స‌ర్కార్ ప‌గ ప‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే అభిప్రాయాలు మొద‌టి రోజు నుంచే వెల్లువెత్తుతూనే వున్నాయి. మంత్రి ప‌ద‌వికి ఈట‌ల రాజీనామా చేసినా ముఖ్య‌మంత్రి కేసీఆర్ శాంతించ‌లేదు. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసే వ‌ర‌కూ… త‌న కేబినెట్ మంత్రుల‌తో, సొంత పార్టీ ఎమ్మెల్యేల‌తో మాన‌సిక దాడి చేయించారు.

చివ‌రికి కేసీఆర్ ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ఈట‌ల రాజేంద‌ర్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం, వెంట‌నే ఆమోదించ‌డం తెలిసిందే. ఆ త‌ర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ఈట‌ల రాజేంద‌ర్ ఘ‌న విజ‌యం సాధించి కేసీఆర్ అహంకారాన్ని చావు దెబ్బ‌తీశారు. ఈట‌ల‌ను అన‌వ‌స‌రంగా గెలికార‌ని సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నాయ‌కులు ప‌లు సంద‌ర్భాల్లో త‌మ మ‌న‌సులో మాట‌ను మీడియా మిత్రుల వ‌ద్ద వెల్ల‌డిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఈట‌ల రాజేంద‌ర్ కుటుంబం చెర‌ప‌ట్టిన భూమి అంటూ… స్వ‌యంగా క‌లెక్ట‌ర్ లెక్క చెప్ప‌డం విశేషం. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కుటుంబానికి చెందిన జమునా హేచరీస్‌ అసైన్డ్‌ భూములను కబ్జా చేసింది వాస్తవమే అని మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌ వెల్లడించారు. మొత్తం 70.33 ఎకరాలను ఈట‌ల కుటుంబం కబ్జా చేసినట్లు సర్వేలో తేలిందని ఆయ‌న తేల్చి చెప్ప‌డం విశేషం.

అచ్చంపేట, హకీంపేట పరిధిలో 56 మందికి చెందిన అసైన్డ్‌ భూములను కబ్జా చేసిన‌ట్టు క‌లెక్ట‌ర్ తెలిపారు. అసైన్డ్‌ భూములను వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్నార‌ని పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై, సహకరించిన అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామ‌ని చెప్పారు.