దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మాటల మర్మమేంటి? ఇప్పుడీ చర్చ విస్తృతంగా సాగుతోంది. కేవీపీ రామచంద్రరావు తనకు ఆత్మలాంటి వాడని వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. వైఎస్సార్, చంద్రబాబు మధ్య రాజకీయాలు ఓ యుద్ధ వాతావరణాన్ని తలపించాయనడంలో సందేహం లేదు. అయితే ఇదంతా అసెంబ్లీ వరకే పరిమితం.
అసెంబ్లీ వెలుపల వైఎస్సార్, చంద్రబాబు కలిస్తే హాయిగా నవ్వుకుంటూ పలకరించుకునే వారు. పరస్పరం జోకులేసుకునే వారు. వైఎస్సార్ తనకు మంచి మిత్రుడని చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
రాజకీయంగా మాత్రం ఘాటు విమర్శలు చేసుకోవడం విధితమే. వైఎస్సార్‌కు సూట్‌కేసులు మోసే వ్యక్తిగా కేవీపీని ఉద్దేశించి అనేక మార్లు టీడీపీ నేతలు విమర్శించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, కేవీపీ కలయిక అందరి దృష్టిని ఆకర్షించింది. కేవీపీ భుజంపై ఆత్మీయంగా చేయి వేసి, ఐదు నిమిషాల పాటు ఇద్దరూ మాటల్లో పడిపోవడం మరింత ఆశ్చర్యపరిచింది.
రోశయ్యకు నివాళి అర్పించడానికి వాళ్లింటికి చంద్రబాబు వెళ్లారు. రోశయ్య భార్య శివలక్ష్మితో పాటు కుటుంబ సభ్యుల్ని చంద్రబాబు పరామర్శించి, ఓదార్చారు. అనంతరం తిరుగుముఖం పట్టారు. అక్కడే ఉన్న కేవీపీ…‘బాబూ బాగున్నారా’ అంటూ నమస్కరిస్తూ ఆత్మీయంగా పలకరించారు. చంద్రబాబు కూడా అంతే సంస్కారంతో ప్రతి నమస్కారం చేస్తూ… బాగున్నానని సమాధానం ఇచ్చారు. అంతటితో ఆగి ఉంటే ఎలాంటి చర్చే లేదు.
కానీ కేవీపీ భుజంపై చేయి వేసి దగ్గరికి తీసుకున్నారు. ఇద్దరూ ఐదు నిమిషాలు వ్యక్తిగతంగా మాట్లాడుకోవడాన్ని రాజకీయ వర్గాల్లో విశేషంగా చెప్పుకుంటున్నారు. చంద్రబాబు, కేవీపీ ఏం మాట్లాడుకుని ఉంటారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. రాజకీయాల్లో గట్టి ప్రత్యర్థులుగా నిన్నమొన్నటి వరకూ గుర్తింపు పొందిన నేతల మధ్య ఇలాంటి స్నేహపూర్వక సంబంధాలు ఆహ్వానించదగ్గవే అని పౌర సమాజం అభిప్రాయపడుతోంది.