రోశయ్య మరణం కూడా చంద్రబాబుని వదల్లేదే..!

అసలు ఇటీవల కాలంలో ఎక్కడ ఏది జరిగినా అన్నీ చంద్రబాబు మెడకే చుట్టుకుంటున్నాయి. తాజాగా రోశయ్య కన్నుమూసిన ఘటన కూడా చంద్రబాబుకి సంకటంలా మారింది.  Advertisement అసలు విషయం ఏంటంటే.. రోశయ్య మరణం తర్వాత…

అసలు ఇటీవల కాలంలో ఎక్కడ ఏది జరిగినా అన్నీ చంద్రబాబు మెడకే చుట్టుకుంటున్నాయి. తాజాగా రోశయ్య కన్నుమూసిన ఘటన కూడా చంద్రబాబుకి సంకటంలా మారింది. 

అసలు విషయం ఏంటంటే.. రోశయ్య మరణం తర్వాత అన్ని శాటిలైట్ ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్లు.. ఆయన పాత వీడియోల కోసం వెదికాయి. అసెంబ్లీలో ఆయన ప్రసంగాల్ని వెలికితీసి వాటికి మేకప్ వేసి స్టోరీలు ఇవ్వాలని చూశాయి. ఈ క్రమంలో ఓ వీడియో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో రోశయ్య, చంద్రబాబు మధ్య వాగ్వాదం ఇప్పుడు హైలెట్ గా మారింది.

ఎన్డీఆర్ డ్రామా ఆర్టిస్ట్ గా రాణించి ఆ తర్వాత సినీనటుడయ్యారు, రాజకీయ నాయకుడయ్యారని రోశయ్య కామెంట్ చేసిన సందర్భంలో దానికి చంద్రబాబు రియాక్ట్ కావడం, రోశయ్యకు తెలివితేటలు ఎక్కువయ్యాయని, కోపం కూడా పెరిగిందంటూ సెటైర్లు వేయడం, ఆ సెటైర్లకు రోశయ్య మరింత హుందాగా రియాక్ట్ కావడం ఆ వీడియో సారాంశం.

వెన్నుపోటు వీరుడు..

తనకి నిజంగానే కోపం పెరిగిందని అయితే తెలివితేటలు మాత్రం తనకు లేవని వ్యంగ్యంగా చంద్రబాబుకి బదులిస్తారు రోశయ్య. 

తనకి అంత తెలివితేటలే ఉంటే.. తనను నమ్మిన రాజశేఖర్ రెడ్డిని కత్తితో పొడిచి తాను ఆ పదవి చేపట్టేవాడినని, అంత వరకూ ఎందుకు.. గతంలో ఉన్న ముఖ్యమంత్రులకైనా వెన్నుపోటు పొడిచేవాడినని అంటారు రోశయ్య. పరోక్షంగా చంద్రబాబు వెన్నుపోటు వీరుడని సభకు గుర్తు చేస్తారు.

ఒకటి అని, ఐదు అనిపించుకునే రకం..

చంద్రబాబు ఒకటి అని, ఐదు అనిపించుకునే రకం అంటూ రోశయ్య ఓ రేంజ్ లో విరుచుకుపడతారు. తనని విమర్శించినందుకే తాను వెన్నుపోటు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చానని, తన జోలికి రావద్దని పరోక్ష హెచ్చరికలు చేస్తారు. 

ఈ ఎపిసోడ్ అంతా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతోంది. ఈ వీడియోనే కాదు.. రోశయ్య అసెంబ్లీలో మాట్లాడిన డైలాగుల్లో చాలా వరకు చంద్రబాబుకి చాకిరేవు పెట్టినవే ఉన్నాయి.

ఇప్పటికీ మారలేదా..?

రోశయ్య అసెంబ్లీ వీడియో చూస్తే చంద్రబాబు ఇప్పటికీ మారలేదని అర్థమవుతుంది. ఒకటి అని, ఐదు అనిపించుకోవడం ఆయనకు అలవాటైపోయింది. ఆ అలవాటు వల్లే ఇటీవల అసెంబ్లీలో అవమానపడి, మీడియా ముందు వెక్కి వెక్కి ఏడవాల్సి వచ్చింది. 

దశాబ్దాలు గడిచినా, ప్రభుత్వాలు-రాజకీయాలు మారినా, చంద్రబాబు తీరు ఏమాత్రం మారలేదని చెప్పడానికి తాజాగా వెలుగులోకి వచ్చిన రోశయ్య వీడియోనే ప్రత్యక్ష ఉదాహరణ.