2019 అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఎందుకంత ఘోరంగా ఓడించారో ఇప్పటికీ అర్థం కాలేదని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. బాబు ఘోర పరాజయానికి ఆయనకు తప్ప అందరికీ కారణాలు స్పష్టంగా తెలుసు. తాను ఏడిస్తే, లోకమంతా గుక్క పట్టి ఏడ్వాలని, నవ్వితే నవ్వాలనే నియంత పోకడలు బాబులో ఇంకా పోలేదు. బహుశా పుట్టకతో వచ్చిన కొన్ని స్వభావాల్ని ఎన్ని ఓటములైనా మార్చలేవేమో!
ఇటీవల వరద బాధిత ప్రాంతాల్లో తనకు మైలేజీ రాకపోవడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు తనను బాధిత ప్రజలు ఎందుకు ఆదరించలేదో చంద్రబాబుకు అర్థం కాకపోవడం, ఆయన పతనావస్థను ప్రతిబింబిస్తోంది. మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరద బాధిత ప్రాంతాల్లో చేసిన ఓదార్పు పర్యటన విజయవంతమైంది. చంద్రబాబు, జగన్ పర్యటనల్లో స్పష్టమైన తేడాను గుర్తిస్తే చాలు…చంద్రబాబు ఎందుకు ఘోరంగా ఓడిపోయారో కారణాలు తెలుసుకోవచ్చు.
వైఎస్సార్ జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి కొన్ని గ్రామాలు నేలమట్టమయ్యాయి. పదుల సంఖ్యలో మనుషుల ప్రాణాలు పోయాయి. ఇది తీవ్ర విషాదం. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా తుపాన ప్రభావంతో భారీగా ఆస్తి, పంట నష్టం సంభవించాయి. ఈ మూడు జిల్లాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ముందుగా పర్యటించారు.
ప్రకృతి వైపరీత్యాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకోవాలని చంద్రబాబు భావించడంలో తప్పులేదు. అయితే పరామర్శ, ఓదార్పు పేరుతో వెళ్లి… అందుకు విరుద్ధంగా వ్యవహరించడమే విమర్శలకు తావిచ్చింది. తన పర్యటనలో భార్య భువనేశ్వరిపై అధికార పార్టీ నాయకులు దూషణలకు దిగారని గోడు వెల్లబోసుకున్నారు. వరద తాకిడికి నష్టపోయిన బాధితుల దగ్గరికెళ్లి ఓదార్చడానికి వెళ్లి, తన బాధలన్నీ చెప్పుకుని రాజకీయ ప్రయోజనాలు ఆశించడం వికటించింది.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితుల గోడు విన్నారు. తమ డిమాండ్లను జగన్ ముందు ఉంచారు. తక్షణం సురక్షిత ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపడతామని జగన్ హామీ ఇచ్చారు. అలాగే వరద బాధిత నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు తన కార్యాలయ అధికారులను అక్కడికక్కడే ఆదేశించి భరోసా కల్పించారు. జగన్‌ను చూడగానే, కష్టాలు తొలిగిపోతాయనే భరోసా బాధిత కుటుంబాల్లో కలిగింది. దీనికి జగన్‌ను చంద్రబాబు నిందిస్తే ప్రయోజనం ఏంటి?
‘ముఖ్యమంత్రి బాధితుల పరామర్శకు వెళ్లినపుడు ఒక ముసలావిడ నవ్వుతూ మాట్లాడుతోంది. ప్రపంచంలో ఎక్కడన్నా ఇలా జరుగుతుందా. 62 మంది చనిపోతే బాధ ఉండదా?, సీఎంను పొగుడుతారా?, గడ్డం పట్టుకుని ముద్దు పెట్టుకుంటారా?, ఏం మనుషులు వీళ్లు. సభ్యత, సంస్కారం లేకుండా ఉన్నారు. బుద్ధి, జ్ఞానం లేకపోతేనే ఇటువంటి ఆలోచనలు వస్తాయి’ అని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు… ఆయన ఎంతగా ప్రస్ట్రేషన్‌లో ఉన్నాడో చెప్పకనే చెబుతున్నాయి.
పుట్టెడు దుఃఖంలో ఉన్న వాళ్లకి ఉపన్యాసాలు అవసరం లేదు. వాళ్ల ఘోష వినడానికి ఓ శ్రోత కావాలి. ఇక్కడే చంద్రబాబు పెద్ద తప్పు చేశారు. తన సహజ ధోరణిలో వరద బాధితుల దగ్గరికెళ్లి ఉపన్యాసాలు దంచికొట్టారు. కానీ జగన్ మాత్రం వాళ్ల అవేదన విన్నారు, తానున్నానని భరోసా కల్పించారు. ఉన్నంతలో బాధితుల్లో ధైర్యాన్ని నింపారు. అందుకే జగన్‌ను చూడగానే వాళ్ల కళ్లలో ఆనందం.
జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు ముఖ్యంగా ఆడబిడ్డలు, పిల్లలు ఎగబడ్డారు. చంద్రబాబు ఉపన్యాసాలు ఇచ్చి విసుగు తెప్పిస్తే, జగన్ మాత్రం శ్రోతగా వారికి చేరువయ్యారు. జగన్‌ను ప్రజలు ఆదరించడానికి కారణం, తమ గోడు వినడానికి ఓ హృదయం దొరికింది కాబట్టి. ఆ పని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు చేయలేకపోయారు. ఎంత సేపూ నా భార్య భువనేశ్వరి, నేను, నా కుటుంబం అంటూ గొప్పలు చెప్పుకోవడంతోనే సరిపోయింది. ఇంకా ఎంత కాలమని ఇలాంటి చిల్లర రాజకీయాలు.
ఇప్పటికైనా చంద్రబాబు జనం దగ్గరికెళ్లి ప్రసంగాలతో విసిగించకుండా, వారు చెప్పింది వినడం నేర్చుకోవాలి. చంద్రబాబు ఆ పని చేస్తారని జనం అనుకోవడం లేదు. ఎందుకంటే తన భార్య భువనేశ్వరిపై దూషణలు అనే కొత్త ఆయుధం దొరికిందని బాబు సంబరపడుతున్నారు. తాను మారకుండా జనాన్ని, జగన్‌ని ఎన్ని మాటలన్నా ప్రయోజనం ఉండదు.