‘దెయ్యాలు వేదాలు వల్లించినట్టు..’ అని తెలుగు భాషలో ఒక అద్భుతమైన సామెత ఉంది. దెయ్యం అంటేనే క్షుద్రప్రాణి. వేదం పరమపవిత్రమైనది. మరి దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే.. అడ్డగోలుగా దారితప్పిపోయిన వాళ్లు కూడా నీతులు వల్లించడం అన్నమాట.
ఇప్పుడు ఏపీ రాజకీయాలను పరిశీలిస్తే.. బీజేపీ సారధి సోము వీర్రాజు.. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పరిపాలన గురించి చెబుతున్న మాటలు, చేస్తున్న విమర్శలు ఈ సామెతను గుర్తుకు తెస్తున్నాయి. ఆయన ప్రవచించే నీతులు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగానే ఉన్నాయి.
రాజకీయంగా కొంచెం ఎడ్వాంటేజీ తీసుకోవచ్చుననే ఉద్దేశంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే అమరావతి రైతుల పోరాటానికి మద్దతివ్వాలని, అమరావతి ఒక్కటే రాజధాని అని తమ పార్టీ రాజకీయ తీర్మానం చేసిన తర్వాత.. దానికి అన్ని రకాలుగానూ కట్టుబడి ఉండాలని అమిత్ షా పార్టీ నేతలకు చాలా స్పష్టంగా చెప్పారు. హెచ్చరించారు. క్లాస్ తీసుకున్నారు. హఠాత్తుగా రాష్ట్ర బీజేపీ నేతల్లో మార్పు వచ్చేసింది.
నిన్నటిదాకా జగన్మోహన రెడ్డితో అంటకాగిన వారున్నారు. ఆయన ప్రాపకం సంపాదించి తమ స్వార్థ అవసరాలు తీర్చుకున్న వారు, పైరవీలు చేయించుకున్నవారు బీజేపీలో బోలెడు మంది ఉన్నారు. వారందరూ సహజంగానే ఇన్నాళ్లుగా మన్ను తిన్న పాముల్లాగానే పడి ఉన్నారు. ఇప్పుడు అందరూ నిద్ర మేలుకున్నారు. జగన్ మీద ఎగిరెగిరి పడుతున్నారు.
సోము వీర్రాజు.. అమరావతి విషయంలో మూడు రాజధానులకు నిర్ణయం తీసుకునే నైతిక హక్కు జగన్మోహన రెడ్డికి లేదని అంటున్నారు. ‘నైతిక’ అనే పదానికి అర్థం ఈ కమలనాయకుడికి తెలిసే మాట్లాడుతున్నారో.. తెలియక మాట్లాడుతున్నారో తెలియడం లేదు.
ప్రత్యేక హోదా విషయంలో వంచించిన తర్వాత.. బీజేపీ అని చెప్పుకునే ఏ ఒక్క నాయకుడికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసించడానికే నైతిక హక్కు లేదు. ‘నైతిక’ అనే పదం ఇలాంటివాటికి వర్తిస్తుంది. 151 మంది ఎమ్మెల్యేలతో జగన్మోహన రెడ్డికి సంపూర్ణఅధికారాన్ని రాష్ట్రప్రజలు కట్టబెడితే.. రాజధాని అనేది రాష్ట్రప్రభుత్వం యొక్క నిర్ణయాధికారానికి మాత్రమే లోబడి ఉంటుందని.. కేంద్రంలో పార్లమెంటు సాక్షిగా వాళ్ల పార్టీ నాయకులే ప్రకటిస్తే.. అదంతా సోము వీర్రాజు మరచిపోయినట్లున్నారు.
వాళ్ల నిర్ణయం అమరావతి అనుకూలం అయితే.. అంతవరకు తమ వాదన వినిపించాలి. మూడు రాజధానులు ఒప్పుకోం అనాలి. తప్పు అనొచ్చు. అంతే తప్ప… జగన్ కు నైతికంగా హక్కే లేదనడం చోద్యంగా ఉంది. అందుకే సోము వీర్రాజు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయి.
విభజన చట్టం చేసిన హామీలలో హోదా సహా సమస్తం సాధించి తెచ్చే వరకు, బీజేపీ నైతికతను రాష్ట్ర ప్రజలు నమ్మరు. ఈలోగా ఎన్ని వక్రరాజకీయాలు చేసినా.. వారికి ఠికానా ఉండదు అని సోము వీర్రాజు గుర్తించాలి.