జోషిమఠ్ లో భూమి కుంగిపోతోంది, ఇళ్లు బీటలు వారుతున్నాయి, రోడ్లు నిట్టనిలువునా చీలిపోతున్నాయంటూ నెలరోజుల క్రితం హడావిడి జరిగిన సంగతి తెలిసిందే. కేవలం 12రోజుల్లోనే జోషిమఠ్ 5.4 సెంటీమీటర్ల మేర కుంగిపోయిందని ఇస్రో శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో అసలు ఇదంతా ఎందుకు జరుగుతోందనే అనుమానం అందరిలో మొదలైంది. దగ్గర్లోనే కొండలను తవ్వేస్తున్నారని, రోడ్ల కోసం పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారని వాటివల్లే ఇలాంటి ఇబ్బందులని స్థానికులు చెబుతున్నారు. చివరకు అదే నిజమని తేలింది. జోషిమఠ్ కుంగిపోడానికి అసలు కారణాలను ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) నిపుణులు బయటపెట్టారు. జనాభా పెరుగుదల, దానికి అనుగుణంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వల్లే జోషిమఠ్ కుంగిపోయిందని కుండబద్దలు కొట్టారు.
హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న జోషిమఠ్ ప్రాంతం చార్ థామ్ యాత్రకు కేంద్ర బిందువుగా ఉంటుంది. ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కూడా సహకరిస్తోంది. ఆ సహకారమే ఇప్పుడు జోషి మఠ్ కు శాపమైంది. రహదారుల కోసం కొండల్ని తవ్వుతున్నారు. పెరుగుతున్న అవసరాల కోసం విద్యుత్ ప్లాంట్ లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో జోషిమఠ్ పై ఒత్తిడి పెరిగింది.
పర్యాటకంగా అభివృద్ధి చేసే క్రమంలో జనాభా కూడా పెరిగింది. హిమాలయ అందాలను చూసేందుకు జోషిమఠ్ ప్రధాన కేంద్రం కావడంతో పర్యాటకులు భారీగా రావడం, అక్కడే నెలల తరబడి ఉండటం, జోషిమఠ్ పై ఒత్తిడికి కారణం. వారికి అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పన కోసం కొత్త నిర్మాణాలు వచ్చాయి.
అయితే జోషిమఠ్ మైదాన ప్రాంతం కాదు, పర్వత ప్రాంతం, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతం అనే విషయాన్ని మరచిపోయారంతా. గతంలో వరదల వల్ల ఆ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు ఏకంగా భూమాత ఆగ్రహాన్ని చవిచూసింది. అయితే ఒకరకంగా ఇది ప్రకృతి ప్రకోపం కాదు, మానవ తప్పిదమేనని ఇప్పుడు తేలింది.