వాడకం అంటే ఇదీ.. లవ్ లెటర్ల కోసం చాట్ జీపీటీ

అసలే టెక్నాలజీ పెరిగాక మనిషి పనిచేయడానికి బద్దకిస్తున్నాడు, ఇప్పుడు చాట్ జీపీటీ రావడంతో ప్రేమించడానికి కూడా బద్దకించేస్తున్నాడు. అవును.. ప్రేమ లేఖలు రాసేందుకు కూడా చాట్ జీపీటీ సాయం తీసుకుంటున్నారు చాలామంది. వాలంటైన్స్ డే…

అసలే టెక్నాలజీ పెరిగాక మనిషి పనిచేయడానికి బద్దకిస్తున్నాడు, ఇప్పుడు చాట్ జీపీటీ రావడంతో ప్రేమించడానికి కూడా బద్దకించేస్తున్నాడు. అవును.. ప్రేమ లేఖలు రాసేందుకు కూడా చాట్ జీపీటీ సాయం తీసుకుంటున్నారు చాలామంది. వాలంటైన్స్ డే సందర్భంగా 9 దేశాల్లో 5వేల మందిపై జరిగిన ఓ ఆన్ లైన్ సర్వే ఈ ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.

ఈ ఏడాది మీ లవర్స్ కి ఎలాంటి గిఫ్ట్ ఇస్తున్నారు, లవ్ లెటర్ రాస్తున్నారా..? అంటూ సాగిన సర్వేలో లవ్ లెటర్ ఇస్తాం కానీ, దానికి చాట్ జీపీటీ సాయం తీసుకుంటామని చెప్పారు చాలామంది. దాదాపు 40 శాతం మంది లవర్స్, చాట్ జీపీటీ తయారుచేసి ఇచ్చిన లవ్ లెటర్స్ పోస్ట్ చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారట.

అమ్మాయిలు అంత ముదుర్లు కాదు..

ఈ ఆన్ లైన్ సర్వేలో అమ్మాయిలు కూడా పాల్గొన్నారు. అయితే వారు మాత్రం తమ పార్టనర్స్ ని మోసం చేయలేమంటున్నారు. కేవలం నూటికి 5 శాతం మంది మాత్రమే చాట్ జీపీటీ సాయంతో లవ్ లెటర్లు రాస్తామంటున్నారు. మిగతావారంతా తమ ప్రేమకు తామే అక్షర రూపం కల్పిస్తామని చెబుతున్నారు.

ప్రేమికుల రోజుకి ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ముస్తాబవ్వాలనుకుంటారు, అందమైన గిఫ్ట్ ఇచ్చి ఇంప్రెస్ చేయాలనుకుంటారు. అదే సమయంలో అందమైన ప్రేమలేఖతో తమ భావాలు పంచుకుంటామనే ఆలోచన కూడా చేస్తారు. ఇప్పటి వరకూ లవ్ లెటర్లు సొంతంగా రాయడమో లేక, స్నేహితులతో రాయించడమే చేసినవారు ఈ ఏడాది కొత్తగా చాట్ జీపీటీని ట్రై చేస్తున్నారు.

తమ పేరు, తమ ప్రేయసి పేరు ఎంటర్ చేసి.. అందమైన లవ్ లెటర్ తయారు చేసి ఇవ్వాలని చాట్ జీపీటీని అడుగుతున్నారు. ఈ ఏడాది వాలంటైన్స్ డే కి ఈ కొత్త సంప్రదాయం మొదలైందనమాట.