ప్రజల నాడి, ప్రజల దృష్టిని బట్టి రాజకీయ ఎత్తుగడలు వుండాలి. అలా కాకుండా ఏదో ఒక ఎత్తుగడ వేసి, ఏదో చేసి, తమ మీడియాలో భాజా భజంత్రీలు వాయించినంత మాత్రాన పని జరగదు. హడావుడి మాత్రమే మిగులుతుంది. నిత్యం పత్రికల్లో పతాక శీర్షికల్లో కనిపించడం వరకు ఈ కార్యక్రమాలు బాగానే వుంటాయి తప్ప ఓట్లు రాల్చడానికి పెద్దగా పనికి రావు ఇవి.
మొదటి నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీదే హడావుడి చేస్తూ వస్తోంది తెలుగుదేశం, దాని మీడియా. కానీ జగన్ ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటున్న జనాలకు ఇది అస్సలు పట్టని వ్యవహారం. జగన్ అప్పు చేసి ఇచ్చాడా? ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చాడు అన్నది అనవసరం. అందుకే రాష్ట్రం ఏమవుతుంది అనే గడబిడ చేసినా జనానికి పట్టనిది.
ఇక రెండోది పచ్చ మీడియా రాసే, ప్రచారం చేసే అభూత కల్పనలు. రోడ్లు బాగా చేయలేదు. పరిశ్రమలు రావడం లేదు. ఉపాధి లేదు అని తెలుగుదేశం అనుకూల మీడియా తెగ ఊదరగొడుతూ వుంటుంది. హైదరాబాద్ లోనో, విదేశాల్లోనో వున్నవారు దీన్ని నమ్మవచ్చు. కానీ లోకల్ గా ఏం జరుగుతోందో లోకల్ జనాలకే తెలుస్తుంది. ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఏదో ఒకటి ఏర్పాటు అవుతూనే వుంది. వస్తూనే వుంది. జగన్ నా, చంద్రబాబు నా అని కాదు క్వశ్చను. కొత్త సంస్థలు, మార్పులు అలా వాటంతట అవి వస్తూనే వుంటాయి. ఆ మార్పులు చేర్పులు లోకల్ జనాలకు బాగా కనిపిస్తూనే వుంటాయి. అందువల్ల వాటి మీద యాగీ చేసి ప్రయోజనం లేదు.
మద్యనిషేధం అన్నాడు జగన్ ..,కానీ చేయలేదు. నిజమే. కానీ మద్య నిషేధం కోసమే జగన్ కు ఓటేసారా ఎవరైనా అంటే అనుమానమే. తాగే వాళ్లకు ఇది పట్టదు. మిడిల్ క్లాస్ జనాలకు ఈ తాగుడు వైనం అస్సలు పట్టదు. ఇక దీని మీద యాగీ చేసి ఏమిటి ప్రయోజనం?
అమరావతి వ్యవహారం కూడా ఇలాంటిదే. జనాలకు రాజధాని సెంటిమెంట్, జోకులు, ఇవన్నీ కేవలం మీడియా వరకే. గ్రౌండ్ లెవెల్ లో దక్షిణ కోస్తా తప్ప మరొరికి ఈ అంశం పట్టదు. అలా పడితే కనుక రాజధాని ప్రకటించిన విశాఖ ప్రాంతంలో వైకాపాకు తిరుగు లేకుండా వుండాలి. కానీ అలా ఎప్పుడూ వుండదు.
లోకేష్ పాదయాత్ర ముందే కూసిన కోయల చందం. ఇంకా ఎన్నికలు చాలా దూరం వున్నాయి. ఒకటో రోజు చేసిన సభ ఎఫెక్ట్ 400 రోజు నాటికి వుంటుందా? అన్నది అనుమానం.
మరి ఏం అంశమూ తీసుకోక, ప్రతిపక్షంగా ఏం చేయాలి అని అడగొచ్చు. అది పాయింట్ కూడా.
జనాలు నేరుగా ఎఫెక్ట్ అయ్యే పాయింట్ల మీద అలజడి చేయాలి హడావుడి చేయాలి. ఇసుక అన్నది జనాలకు టచ్ అయ్యే పాయింట్. జీతాలు చెల్లింపులో ఆలస్యం అన్నది మరో పాయింట్. గ్యాస్, పెట్రోలు, ఇంకా రకరకాల ధరల పెరుగుదల అన్నది జనాలను బాధపెట్టే విషయాలు.
అసలు ధరల పెరుగుదల అన్నదే తెలుగుదేశం పార్టీకి పట్టడం లేదు. ఎందుకంటే అక్కడ వ్యవహారం కేంద్రంలో లింక్ అయి వుంది. జిఎస్టీ, పెట్రోలు, వంట గ్యాస్ ఇవన్నీ కేంద్రం పరిథిలో వున్నాయి. రాష్ట్రంలో వ్యాట్ అన్నది చంద్రబాబు హయాంలో వున్నదే ఇప్పుడూ అమలు అవుతోంది. అందువల్ల అక్కడ మాట్లాడే పరిస్థితి లేదు.
దానా, దీనా అరౌండ్ ది బుష్ అన్నట్లు మీడియాలో, సోషల్ మీడియాలో హడావుడి చేసుకోవడానికి బాగుంటుంది తప్ప ఓట్లు రాల్చడానికి కాదు. ఓట్లు రాలాలంటే లోకల్ లీడర్ షిప్ పటిష్టంగా వుండాలి. గ్రౌండ్ లెవెల్ పోల్ మేనేజ్ మెంట్ సరిగ్గా వుండాలి. కేండిడేట్ బలంగా వుండాలి. డబ్బులు కుమ్మరించాలి.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద అస్సలు దృష్టి పెట్టడం లేదు. ఇప్పుడు ఈ కందిరీగల తుట్ట ఎందుకు కదపాలి అని చూస్తోంది. ఎవరికి వారు తమదే టికెట్ అనుకుంటూ భ్రమల్లో వున్నారు. గతంలో అధికారం చెలాయించిన మాజీలు ఇప్పుడు మళ్లీ తెరమీదకు వచ్చారు. తమకే టికెట్ అన్నంత హడావుడి చేస్తున్నారు. ఎలాగూ ఇప్పటికే అనుచర గణం వుండడంతో వారి హడావుడి ముందు కొత్త వారి హడావుడి కనిపించడం లేదు.
టికెట్ ల కేటాయింపులో ఓ క్లారిటీ వుంటే ప్రిపరేషన్ అనేది సులువు అవుతుంది. కానీ అస్సలు దీని మీద మాత్రం దృష్టి పెట్టడం లేదు తెలుగుదేశం పార్టీ. ప్రస్తుతానికి ఇలా నడవనీ అనుకుంటోంది. కానీ రేదు వన్స్..టికెట్ లు ప్రకటించాక అసలు సమస్య వుంటుంది. ఇప్పటి వరకు జరిగిన మీడియా, సోషల్ మీడియా ప్రచారం అంతా పార్టీకి ఎంత పాజిటివ్ పొజిషన్ తీసుకువస్తుంది అన్నది పక్కన పెడితే కేండిడేట్ ల మీద, లోకల్ పార్టీ మీద దృష్టి పెట్టకపోవడం అన్నది అంతకు మించిన డ్యామేజ్ చేస్తుంది.
పైగా కింది స్థాయిలో పార్టీ వ్యవహారాలను పచ్చ మీడియా కప్పి పుచ్చుతోంది. అలా కప్పి పుచ్చిన ఫలితం రేపు ఒకేసారి బయటకు వచ్చాక తెలుస్తుంది. అప్పుడు ఈ మీడియా రాంగ్ రూట్ ప్రచారం ఆదుకోదు. ఈ మీడియాను నమ్ముకుని, దాని బ్యానర్ల వార్తలకు పనికి వచ్చే దిశగా వెళ్తోంది తెలుగుదేశం పార్టీ. అదే అది పెద్ద తప్పిదం అవుతుంది.