హీరో రానా, ఆయ‌న తండ్రిపై క్రిమిన‌ల్ కేసు

ఫిలింన‌గ‌ర్ భూవివాదంలో హీరో రానా, ఆయ‌న తండ్రి, నిర్మాత ద‌గ్గుబాటి సురేష్‌బాబుల‌పై క్రిమిన‌ల్ కేసు న‌మోదైంది. కోర్టు ఆదేశాల మేర‌కు కేసు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. వ్యాపారి ప్ర‌మోద్ న్యాయ పోరాటం వ‌ల్ల నిర్మాత‌తో…

ఫిలింన‌గ‌ర్ భూవివాదంలో హీరో రానా, ఆయ‌న తండ్రి, నిర్మాత ద‌గ్గుబాటి సురేష్‌బాబుల‌పై క్రిమిన‌ల్ కేసు న‌మోదైంది. కోర్టు ఆదేశాల మేర‌కు కేసు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. వ్యాపారి ప్ర‌మోద్ న్యాయ పోరాటం వ‌ల్ల నిర్మాత‌తో పాటు ఆయన కుమారుడైన హీరోపై కేసు న‌మోదుకు దారి తీసింద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో వ్యాపారి ప్ర‌మోద్ మీడియాతో మాట్లాడుతూ వివ‌రాలు వెల్ల‌డించారు. ఫిలింన‌గ‌ర్‌లో ప్లాట్ నంబ‌ర్‌-2ను త‌న‌కు సురేష్‌బాబు  విక్ర‌యించాడ‌న్నారు. 2014 నుంచి 2018 వ‌ర‌కు స‌ద‌రు స్థ‌లాన్ని లీజుకు తీసుకున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. ఆ త‌ర్వాత  తాను ఆ ప్లాట్‌ను సురేష్‌బాబు నుంచి  రూ.18 కోట్ల‌కు కొన్నాన‌ని, రూ.5 కోట్లు అడ్వాన్స్ చెల్లించిన‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. అయితే పూర్తి అమౌంట్ చెల్లిస్తాన‌ని, రిజిస్ట్రేష‌న్ చేయించాల‌ని కోర‌గా సురేష్‌బాబు అంగీక‌రించ‌లేద‌న్నారు. పైగా ఆ స్థలం నుంచి త‌మ‌ను దౌర్జ‌న్యంగా ఖాళీ చేయించార‌ని ప్ర‌మోద్ వాపోయారు.

త‌న కుమారుడి పేరుపై స‌ద‌రు ప్లాట్‌ను రిజిస్ట్రేష‌న్ చేయించాడ‌న్నారు. త‌న‌కు రూ.18 కోట్ల‌కు విక్ర‌యించి, ఆ త‌ర్వాత రెండేళ్ల‌కు రూ.9 కోట్ల‌కు కుమారుడైన రానాకు విక్ర‌యించిన‌ట్టు రిజిస్ట్రేష‌న్ చేయించ‌డం అంతా కుట్ర‌గా ఆయ‌న చెప్పారు. 

ద‌గ్గుబాటి సురేష్‌, ఆయ‌న కుమారుడిపై ఫిర్యాదు చేసినా బంజారాహిల్స్ పోలీసులు ప‌ట్టించుకోలేద‌న్నారు. దీంతో నాంప‌ల్లి కోర్టును ఆశ్ర‌యించ‌గా వాళ్లిద్ద‌రిపై కేసు న‌మోదుకు ఆదేశించింద‌న్నారు.