చంద్రబాబునాయుడి అరెస్ట్‌తో టీడీపీ తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్లింది. ఐదారు రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. బాబుకు ఇప్పట్లో బెయిల్ రాదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ట్వీట్ కూడా బలాన్ని కలిగిస్తోంది. న్యాయం కనుచూపు మేరలో కనిపించడం లేదంటూ ఆయన ఆవేదనతో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ నుంచి వచ్చిన అంత పెద్ద న్యాయవాది నిరాశతో ట్వీట్ చేయడంతో అసలు చంద్రబాబుకు రెండు మూడు నెలలు బెయిల్ రాదనే ఆందోళనలో టీడీపీ శ్రేణులున్నాయి. ఈ నేపథ్యంలో బాబు అరెస్ట్ టీడీపీకి ఒకే ఒక్క ప్రయోజనం కలిగించింది. టీడీపీకి, ముఖ్యంగా లోకేశ్‌తో దూరంగా వుంటున్న ఎంపీలను యువ నాయకుడికి చేరువ చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం లోకేశ్ ఢిల్లీ పర్యటనలో వున్నారు. తన తండ్రి అరెస్ట్ అక్రమమని జాతీయ నేతలకు చెప్పుకుని మద్దతు పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. అయితే టీడీపీ ఆశించిన స్థాయిలో జాతీయ నేతల నుంచి మద్దతు లభించడం లేదనే టాక్. ఇదిలా వుండగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చంద్రబాబునాయుడి అరెస్ట్ ఉదంతాన్ని ప్రస్తావించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ క్రమంలో టీడీపీ పార్లమెంట్ సభ్యుల సమావేశం లోకేశ్ అధ్యక్షతన ఇవాళ జరగనుంది. ఈ సమావేశం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో నిర్వహించతలపెట్టడం విశేషం.
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర గుంటూరు, విజయవాడ లోక్‌సభ స్థానాల పరిధుల్లో జరిగినప్పుడు వాటికి సంబంధించి ఇద్దరు టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని అటు వైపు తొంగి చూడకపోవడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఒకవైపు లోకేశ్ పాదయాత్రకు జనం వెల్లువెత్తుతున్నారని ఎల్లో మీడియా తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తుండగా, సొంత పార్టీ ఎంపీలే డుమ్మా కొట్టారని, దీనిపై ఏమంటారంటూ ప్రత్యర్థుల ప్రశ్నకు సమాధానం కరువైంది. లోకేశ్ తీరు నచ్చకనే టీడీపీ సీనియర్ నేతలు దూరమవుతున్నారనే ప్రచారం ఉంది.
చంద్రబాబు అరెస్ట్ పుణ్యమా అని లోకేశ్‌తో టీడీపీ ఎంపీలు గల్లా, కేశినేని నాని సమావేశం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేశినేని కూడా సమావేశానికి వెళ్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. కనీసం ఇదొక్క మంచైనా బాబు అరెస్ట్‌తో జరిగిందని వైసీపీ సెటైర్ విసరడం గమనార్హం.