రాయలసీమలో నీళ్లకు, పంటలకు కరవు అనే మాట నిజం. అక్కడి ప్రజలు గొడ్డుకారం తింటారన్నది కూడా పచ్చి నిజం. కానీ ఆ కారంలో మమకారం ఉంది. అక్కడి మనుషుల్లో ప్రజలను ప్రేమించే హృదయం ఉంది. అన్నా, అబ్బి, అక్కా, అమ్మి అని వాత్సల్యం నిండిన కంఠంతో పిలిస్తే చాలు…ప్రాణాలైనా ఇచ్చే త్యాగం వారి సొంతం. కులమతాలకు అతీతంగా మామ, చిన్నాయన, పెదనాయన, వదినా, అక్కా, అత్తా అని వరుసలు పెట్టి పిలుచుకునే అనుబంధం వారిది.
ఒకప్పుడు రాయలసీమలో ముఠాకక్షలు ఉన్నది నిజమే. కానీ మారుతున్న కాలంతో పాటు అక్కడి ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఫ్యాక్షన్ వద్దు ఫ్యాషన్ ముద్దు అని అక్కడి యువత నినదిస్తోంది. ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి పెద్దపెద్ద చదువులు చదువుతూ దేశవిదేశాలకు వెళ్లి తమ ప్రాంత గొప్పదనాన్ని చాటి చెబుతున్నారు.
ఇటీవల జనసేనాని పవన్‌కల్యాణ్ రాయలసీమలో ఐదురోజుల పాటు పర్యటించారు. ఆయన పదేపదే సీమ వాసులను ముఠాకోరులుగా చిత్రీకరించడం…అక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘన రాయలసీమలోనే ఎక్కువగా జరుగుతోందని ఇటీవల ఆయన చేసిన ట్వీట్ సీమవాసుల ఆగ్రహానికి గురైంది. మరీ ముఖ్యంగా రాయలసీమలో కూడా అనడానికి, రాయలసీమలోనే అని నొక్కి చెప్పడానికి చాలా వ్యత్యాసం ఉందని రాయలసీమలోని ప్రజాసంఘాలు, సీమ ఉద్యమ సంస్థలు మండిపడుతున్నాయి.
పవన్ అధ్యక్షతన జరిగిన సభలో అనంతపురం జిల్లా రాప్తాడు జనసేన ఇన్‌చార్జ్ సాకే పవన్‌కుమార్ మాట్లాడుతూ “మమ్మల్ని పవన్‌కల్యాణ్ వదిలేసి ఏమైనా చేయమంటే…మీ తలకాయలు నరకడానికి ఆలస్యం చేయం. ప్రకాశ్‌రెడ్డి కాదు, జిల్లాలో ఏ రెడ్డి అయినా సరే. మేం రెడీ. మీరు రెడీనా” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
ఈ వ్యాఖ్యలపై కర్నూలు రెడ్ల సంఘం తీవ్రంగా స్పందించింది.
“రాజకీయంగా ఎలాంటి విమర్శలైనా చేసుకోవచ్చు. కులం పేరు ప్రస్తావించడం, ఏ రెడ్డి అయినా సరే అనడం రెడ్లను రెచ్చ గొట్టడమే. మీరు తలతీస్తామంటే మేమూ పవన్ తల తీసేందుకు సిద్ధం ” అని రెడ్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు హెచ్చరించారు.
రెడ్ల వ్యాఖ్యలపై తెనాలిలో కాపునాడు తీవ్రంగా స్పందించింది.
“పవన్‌కల్యాణ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను సోమవారం లోపు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి. లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. పవన్‌కల్యాణ్ తల తీసేస్తాం, ఎముకలు విరిచేస్తాం అంటూ రెడ్డి సంఘం బెదిరించడం మంచి పద్ధతి కాదు” అని వారు హితవు పలికారు.
కాపు, రెడ్ల మధ్య గొడవలు సృష్టించేందుకు చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన ఎల్లోమీడియా రాబంధుల్లా ఎదురు చూస్తోంది. ఏ చిన్న అవకాశం దొరికినా చీమంతను గోరంతలు చేసి కులాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి తమాషా చూసేందుకు ఎల్లో మీడియా గోతి దగ్గర నక్కలా నక్కి ఉంది.
ఒకప్పుడు బెజవాడ కమ్యూనిస్టులకు కంచుకోట. ఆ తర్వాత పరిణామాల్లో అనేక రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. దేవినేని నెహ్రూ, వంగవీటి రంగా కుటుంబాల మధ్య విభేదాలు చివరికి కులాల మధ్య గొడవలకు దారి తీశాయి. ఇరు కుటుంబాల్లోని ముఖ్యులు, వారి అనుచరులు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. రంగా హత్య కాపులు, కమ్మల మధ్య ఎవరూ పూడ్చలేని అగాధాన్ని సృష్టించింది. ఇప్పుడిప్పుడే ఆ రెండు కులాల మధ్య క్షేత్రస్థాయిలో కొంత స్నేహసంబంధాలు ఏర్పడ్డాయి.
అంతెందుకు రెండేళ్ల క్రితం పవన్‌కల్యాణ్ విజయవాడలో మాట్లాడుతూ కులాల మధ్య ఐక్యతను సాధించేందుకు తాను టీడీపీకి మద్దతు ఇచ్చానన్నాడు. వంగవీటి రంగా హత్య అనంతరం కాపు, కమ్మ కులాల మధ్య ఏర్పడిన ద్వేషపూరిత సంబంధాల గురించి ఆయన ఉదహరించాడు. మరి అలాంటి వ్యక్తి రాయలసీమకు వచ్చేసరికి రెడ్లను రెచ్చగొట్టేలా తనతో పాటు పార్టీ నాయకులతో మాట్లాడించడంలో ఔచిత్యం ఏమిటి?
రాయలసీమలో అన్నదమ్ముళ్లా బతుకుతున్న తమ మధ్యకు బెజవాడ కులరాజకీయాలు తీసుకురావద్దని అక్కడి ప్రజలు వేడుకుంటున్నారు. కుల,మత రహిత రాజకీయాలే తమ అజెండాగా చెప్పే పవన్…దాన్ని ఆచరణలో చూపితే అంతకంటే రాయలసీమ వాసులకు ఎలాంటి సాయం చేయాల్సిన అవసరం లేదంటున్నారు.