చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ అమరావతిలో తమ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన ముహూర్తం చాలా బాగుంది. ఆపార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి జగన్ హవాలో పరాజయం మూటగట్టుకున్న బీద మస్తాన్ రావు పార్టీకి రాజీనామా చేశారు.
తెలుగుదేశం పార్టీనుంచి .. ఒక సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు బయటకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని పుకార్లు వస్తున్న తరుణంలో, మరో వర్గానికి చెందిన అనూహ్యంగా పార్టీని వీడడం చంద్రబాబుకు గట్టి దెబ్బే!
మరోవైపు చంద్రబాబునాయుడు జగన్ ప్రభుత్వం మీద బీసీ కోణంలోంచి బురద చల్లడానికి కొత్త కుట్రలు ప్రారంభించారు. కాపు మహిళలకు 15 వేల రూపాయలు ఏటా ఇవ్వడానికి జగన్ సర్కారు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ఆ మొత్తం బీసీ మహిళలకు కూడా ఎందుకు ఇవ్వడం లేదని, బీసీల పట్ల జగన్ వివక్ష చూపిస్తున్నారని రంగు పులమడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
అయితే పార్టీలో బీసీ నాయకుడే అయిన బీద మస్తాన్ రావు పార్టీకి రాజీనామా చేయడం.. తెలుగుదేశం మీద బీసీల ప్రేమ సన్నగిల్లుతున్నదనడానికి నిదర్శనం అని విశ్లేషకులు భావిస్తున్నారు.
బీద రాజీనామాతో.. తన పార్టీ పట్ల బీసీలంతా కూడా అనుమానంగా చూడవచ్చుననే భయంతోనే చంద్రబాబు.. బీసీ యాంగిల్ లోంచి జగన్ మీద బురద చల్లడానికి దిగజారుతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి.
బీద మస్తాన్ రావు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయిన ఇంకా అనేక మంది నాయకులు.. వైకాపాలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. అయితే వారికి జగన్ నుంచి టికెట్ హామీ ఇంకా లభించనందునే చేరికలు ఆలస్యమవుతున్నాయని తెలుస్తోంది. ఇంతకాలం పార్టీని నమ్ముకుని ఉన్న వారిని హఠాత్తుగా విస్మరించలేం అని జగన్ చెబుతున్నట్లు తెలుస్తోంది.
జగన్ గనుక.. పార్టీ తలుపులు బార్లా తెరిస్తే.. తెదేపానుంచి నేతలు పోలోమని వలస వస్తారని పలువురు భావిస్తున్నారు. ప్రస్తతం గెలిచిన ఎమ్మెల్యేలు కూడా.. వంశీ మార్గంలో తెదేపాకు రాజీనామా చేసి.. స్వతంత్ర సభ్యులుగా కొనసాగుతూ.. వైకాపా పంచన ఆశ్రయం పొందడానికి చూస్తున్నారనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.