సచివాలయ ఉద్యోగులపై రెవెన్యూ బాసిజం

స్థానిక సుపరిపాలన అందించడం కోసం సీఎం జగన్ ప్రవేశపెట్టిన అత్యుత్తమమైన వ్యవస్థ గ్రామ సచివాలయాలు. ఓవైపు నిరుద్యోగిత దూరమైంది, మరోవైపు అర్జీలు పట్టుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే పని తగ్గింది. దీనిపై…

స్థానిక సుపరిపాలన అందించడం కోసం సీఎం జగన్ ప్రవేశపెట్టిన అత్యుత్తమమైన వ్యవస్థ గ్రామ సచివాలయాలు. ఓవైపు నిరుద్యోగిత దూరమైంది, మరోవైపు అర్జీలు పట్టుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే పని తగ్గింది. దీనిపై ఇప్పటికే తెలంగాణతో పాటు, ఇతర రాష్ట్రాలూ అధ్యయనం మొదలు పెట్టాయి. అయితే ఇక్కడే ఓ చిన్న అడ్డంకి ఏర్పడింది.

సచివాలయ ఉద్యోగులు చాలామంది అసంతృప్తిలో ఉన్నారని, పని ఒత్తిడి ఎక్కువ కావడంతో రాజీనామా లెటర్లు ఇస్తున్నారని సమాచారం. చిత్తూరు జిల్లాలో ఈ వార్తలు ప్రముఖంగా వచ్చాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా సచివాలయ ఉద్యోగులు, విలేజ్ వాలంటీర్లలో ఇలాంటి అసంతృప్తే ఉంది. దీనికి కారణం రెవెన్యూ అధికారులేనని సమాచారం.

సచివాలయ వ్యవస్థతో రెవెన్యూ అధికారాలకు దాదాపుగా కత్తెరపడే అవకాశముంది. దీంతో సహజంగానే సచివాలయ ఉద్యోగులను బెదిరించి పంపించే పనులు మొదలయ్యాయి. వాస్తవానికి సచివాలయ ఉద్యోగులంతా ప్రస్తుతం ట్రైనింగ్ లో ఉన్నారు. నవశకం కార్యక్రమంలో భాగంగా వీరంతా సమాచార సేకరణకు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు డేటా ఎంట్రీ చేయడం, రాత్రికి వివరాల గురించి పై అధికారులకు వివరణ ఇవ్వడం, పని పూర్తికాకపోతే వారితో అక్షింతలు వేయించుకోవడం..ఇదీ ప్రస్తుతం జరుగుతున్న సీన్.

ఎమ్మార్వో ఆఫీస్ ఉద్యోగులే కాదు, ఎంపీడీవో సిబ్బంది కూడా సచివాలయ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో నరకం చూపిస్తున్నారు. అప్పటివరకూ ప్రైవేట్ డిపార్ట్ మెంటుల్లో ఉన్నతోద్యోగులుగా ఉన్న కొంతమంది, ఇంటింటికీ తిరగాలంటే ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. దీనికితోడు రెవెన్యూ బాసిజాన్ని వీరు తట్టుకోలేకపోతున్నారు. దీంతో సచివాలయ ఉద్యోగులంతా వాట్సాప్ లలో తమ కష్టాలు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. కొంతమంది ఏకంగా రాజీనామాలు కూడా చేసినట్టు తెలుస్తోంది.

అయితే ఈ వ్యవహారాలేవీ బైటకు రాకుండా ఉన్నతాధికారులు గుట్టుగా ఉంచారు. పని విభజన జరిగి, సచివాలయాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఈ కష్టాలన్నీ తొలిగిపోతాయని భావిస్తున్నారు. కానీ ఉద్యోగులు మాత్రం అంతలోపే తాము సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నామని బాధపడుతున్నారు. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని రాద్ధాంతం చేసేలోపే.. సీఎం జగన్ సచివాలయ ఉద్యోగ వ్యవస్థను గాడిలోపెట్టే పని మొదలుపెడితే బెటర్. రెవెన్యూ సిబ్బంది, పంచాయత్ సెక్రటరీల మధ్య పనివిభజన పూర్తిస్థాయిలో జరగకపోవడమే దీనంతటికీ కారణం.