ఎంపీ రఘురామకృష్ణంరాజు మొదటి నుంచి సొంత పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అదే పంథాలో వెళుతున్నారు. సీఎం జగన్ భక్తుడిగా చెప్పుకునే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నిత్యం మీడియా సమావేశాలు నిర్వహిస్తూ, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకట్రెండు రోజులు ఆయనేం చెబుతున్నారో విందామని అన్ని పార్టీల వారు ఆసక్తి కనబరిచారు.
రోజులు గడిచేకొద్ది కోటంరెడ్డిని ఎవరూ పట్టించుకోవడం లేదు. అన్నిటికీ మించి టీడీపీ అసలు పట్టించుకోకపోవడమే షాక్‌కు గురి చేస్తోంది. ఇదంతా కోటంరెడ్డి, టీడీపీ అగ్రనేతలు మాట్లాడుకునే నాటకాలాడుతున్నారనే విమర్శకు బలం కలిగించే ఆధారాలు లేవు. కానీ కోటంరెడ్డిని మాత్రం టీడీపీ నమ్మడం లేదనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇదే వైసీపీ సర్కార్‌ను విమర్శిస్తున్న రఘురామకృష్ణంరాజుకు చంద్రబాబు, లోకేశ్ తదితరులు గట్టి మద్దతుదారులుగా నిలిచారు.
రానున్న ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజు ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనే సంగతి పక్కన పెడితే, ఆయనకు మాత్రం అన్ని విధాలా టీడీపీ అండగా నిలిచింది. రఘురామ కోరుకున్నప్పుడల్లా టీడీపీ అనుకూల మీడియా వాలిపోయేందుకు అన్ని వేళలా సిద్ధంగా వుంది. అంతేకాదు, రఘురామకు బహిరంగంగానే టీడీపీ, జనసేన నేతలు మద్దతుగా నిలిచారు. ఈ స్థాయిలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి టీడీపీతో పాటు జనసేన నుంచి ఆదరణ లభించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకిలా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఇవాళ మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్టు చెప్పారు. అవకాశం వచ్చినప్పుడు కేంద్రహోంశాఖకు నేరుగా ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు. అసలు కేంద్ర ప్రభుత్వమే దేశంలోని పలువురి ప్రముఖల ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నట్టు పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటి కేంద్ర ప్రభుత్వానికి కోటంరెడ్డి ఫిర్యాదు చేయడం ఎలా వుందంటే… ఫోన్ ట్యాపింగ్‌లో ఆరితేరిన వ్యవస్థలకే అదే విషయంలో తనకు న్యాయం చేయాలని కోరినట్టుగా వుంది.
కనీసం ఒక పని చేస్తున్నప్పుడు, అందులో సదరు ప్రభుత్వ పారదర్శకత గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత కోటంరెడ్డిపై లేదా? వైసీపీ నుంచి బయటపడిన కోటంరెడ్డి విషయంలో ఆచితూచి వ్యవహరించేంత భయం ప్రతిపక్షాలకు ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమైంది.
టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనుమానిస్తున్నట్టుగా… కోటంరెడ్డి తమపై కోవర్ట్ ఆపరేషన్ చేస్తారనే భయం ఆ పార్టీని వెంటాడుతోందనే అనుమానాలున్నాయి. అందుకే కోటంరెడ్డి ప్రతిమాటను, చర్యను ప్రతిపక్షాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. బహుశా ప్రతిపక్షాలకు నమ్మకం వచ్చేంత వరకూ కోటంరెడ్డి ఇలా జగన్ సర్కార్‌పై విమర్శలు చేస్తూనే వుండాలేమో!