ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నట్టుండి జగన్ కు వ్యతిరేకంగా మారారు. వైఎస్ఆర్ కు వీరవిధేయుడిగా ఉన్న ఉండవల్లి ప్రెస్ మీట్లు పెట్టి మరీ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలుపెట్టారు.
ఇటు ముద్రగడ పద్మనాభం అనూహ్యంగా జగన్ కు మద్దతు తెలుపుతున్నారు. చంద్రబాబు పతనం కోరుకుంటున్నారు. తాజాగా ఆయన విడుదల చేసిన మరో లేఖ కూడా జగన్ కి అనుకూలంగా ఉంది. ఇలా ఒకరు ప్రెస్ మీట్లతో జగన్ ను విమర్శిస్తుంటే, మరొకరు తమ లేఖలతో జగన్ కు మద్దతిస్తున్నారు.
ఉండవల్లి ఎందుకు వ్యతిరేకం..?
ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ఆర్ కు అత్యంత సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్నారు. అయితే అప్పట్లో ఆయన జగన్ కి మద్దతివ్వకుండా కాంగ్రెస్ కు విధేయుడిగానే కొనసాగారు. కానీ తన మనసంతా జగన్ చుట్టూనే అన్నట్టుగా వ్యవహరించారు.
జగన్ ప్రతిపక్షంలో ఉండగా.. ప్రెస్ మీట్లు పెట్టి మరీ ప్రతిపక్షాల తీరు ఎలా ఉండాలో సూచనలు ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడేవారు. అలాంటి ఉండవల్లి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రెండేళ్లపాటు ఎలాంటి విమర్శలు చేయలేదు.
ఇటీవల ఆయన ప్రెస్ మీట్లు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రం చేస్తున్న అప్పులు, అసెంబ్లీ సమావేశాల తీరు, పోలవరం ప్రాజెక్టు, మూడు రాజధానుల బిల్లు.. ఇలా అన్నింటిపై ఉండవల్లి వ్యతిరేకంగానే మాట్లాడారు. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, స్టాలిన్ తో పోల్చి మరీ జగన్ ని కామెంట్ చేశారు.
ఉండవల్లి వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఇంకా సీరియస్ గా తీసుకోలేదు. ఆయనపై విమర్శలు మొదలు పెట్టలేదు. వైసీపీ అనుకూల మీడియా కూడా.. ఉండవల్లి వ్యాఖ్యల్లో అనుకూలంగా ఉన్నవాటిని మాత్రమే హైలెట్ చేసి, మిగతావాటిని వదిలేసింది. ఈ క్రమంలో అసలు ఉండవల్లి ఎందుకు జగన్ కి వ్యతిరేకంగా మారారు అనేదే అసలు ప్రశ్న.
ఉండవల్లి వ్యాఖ్యలు కాస్త ఘాటుగా ఉన్నా.. అందులో అంతరార్థాన్ని గ్రహించి నష్టం జరక్కముందే జగన్ ఆయా అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టడం మంచిదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉండవల్లి విమర్శల డోసు పెంచితే మాత్రం కచ్చితంగా ప్రతిపక్షాల హస్తం ఉందని అంచనా వేయొచ్చని చెబుతున్నారు. దీంతో ఉండవల్లికి మరికొంత సమయం ఇచ్చేందుకు వైసీపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
రూటు మార్చిన ముద్రగడ..
నిన్నమొన్నటి వరకు ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల విషయంలో సీఎం జగన్ కు కాస్త వ్యతిరేకంగా ఉన్నారు. అలాగని ఆయన చంద్రబాబుకి అనుకూలంగా ఉన్నారని అనలేం కానీ.. చంద్రబాబుపై ఆయనకి ఎంత వ్యతిరేకత ఉందో ఇటీవల స్పష్టంగా తెలిసింది.
చంద్రబాబు ఏడుపు సీన్ తర్వాత ముద్రగడ రాసిన లేఖ సంచలనంగా మారింది. ఆయన పతనం చూసేందుకే తానింకా ఆత్మహత్య చేసుకోకుండా బతికున్నానని ముద్రగడ అన్నారంటే.. ఆయనలో ఎంత ఆవేదన దాగి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ లేఖ పరోక్షంగా జగన్ కి మద్దతుగా మారింది. చంద్రబాబు పతనం అంటే జగన్ ఉన్నతే అని వేరే చెప్పక్కర్లేదు.
ఇక ముద్రగడ ఇటీవల ప్రధాని మోదీకి రాసిన లేఖ కూడా విశాఖ ఉక్కు ఉద్యమం విషయంలో జగన్ చిత్తశుద్ధిని మెచ్చుకునేలా ఉంది. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని మెచ్చుకుంటూనే, మరో తీర్మానం చేసి విశాఖ ఉక్కు సంకల్ప దీక్షని ప్రధానికి చూపించాలన్నారాయన. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం మరీ అంత దూకుడుగా వెళ్లడం సరికాదని హితవుపలికారు ముద్రగడ.
మొత్తమ్మీద వైఎస్ఆర్ కి నమ్మిన బంటులా ఉన్న ఉండవల్లి ఇప్పుడు ఒక్కసారిగా జగన్ కు వ్యతిరేకంగా మారడం, జగన్ పై సానుకూల దృక్పథం లేని ముద్రగడ.. ఒక్కసారిగా ఆయనకు అనుకూలంగా మారడం ఈ రెండూ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలే.