దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుంది. ఆమె కాల్షీట్ల కోసం మేకర్స్ క్యూ కడతారు. ఇంత క్రేజ్ ఉన్న హీరోయిన్ ఫ్రీ గా నటిస్తుందా? దీపిక పదుకోన్ మాత్రం నటించింది. అవును.. జవాన్ సినిమాలో నటించినందుకు దీపిక పదుకోన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంట.
జవాన్ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించింది దీపిక పదుకోన్. ఇలా నటించినందుకు తను ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయలేదని, ఫ్రీ గా నటించానని చెప్పుకొచ్చింది.
షారూక్-దీపిక మధ్య అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. దీపిక ను హీరోయిన్ ను చేసిన వ్యక్తి షారూక్. ఆ తర్వాత ఇద్దరూ కలిసి నటించిన ప్రతిసారి హిట్ ఇచ్చారు. ఆ అనుబంధంతో షారూక్ అడిగిన వెంటనే జవాన్ లో అతిథి పాత్ర పోషించేందుకు అంగీకరించింది దీపిక. ఇది కూడా పెద్ద హిట్టయింది.
అయితే షారూక్ సినిమాల్లోనే కాకుండా, తను ఏ సినిమాలో అతిథి పాత్ర పోషించినా రెమ్యూనరేషన్ తీసుకోనని అంటోంది ఈ హీరోయిన్. ఇప్పటివరకు ఆమె ఎలాంటి డబ్బులు తీసుకోకుండానే అతిథి పాత్రలు పోషించిందంట.
ప్రస్తుతం జవాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. నిన్నటి వసూళ్లతో కలిపి, ఈ సినిమా ఇండియా బాక్సాఫీస్ లో 348 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్లు 660 కోట్ల రూపాయలు దాటాయి.