ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదటి సారిగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించేందుకు సొంత జిల్లా కడపకు వెళ్తున్నారు. బాధితులను పరామర్శించి, వారి కష్టనష్టాలను తెలుసుకునేందుకు స్వయంగా జగన్ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత నెలలో సంభవించిన తుపాను వల్ల వైఎస్సార్ జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయింది.
దీంతో రాజంపేట మండలంలోని ఎగువమందపల్లి, పులపుత్తూరుతో మరికొన్ని గ్రామాలను అన్నమయ్య ప్రాజెక్టు నీళ్లు ముంచెత్తాయి. పదుల సంఖ్యలో మనుషులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. గ్రామాల్లో ఇళ్లు కొట్టుకుపోయి, ప్రజలు కట్టుబట్టలతో మిగిలారు. ఒకవైపు ప్రజలు ప్రాణాలు పోతున్నా జగన్‌కు పట్టడం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు.
ఇప్పటికే ఆయన బాధిత గ్రామాల్లో పర్యటించి ఓదార్చారు. మృతుల కుటుం బాలకు ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలు ఎంత మాత్రం సరిపోదని, కనీసం రూ.25 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం తక్షణ అవసరంగా రూ.5 వేల పైచిలుకు అందజేయడాన్ని ఆయన తప్పు పట్టారు. తమ వంతు సాయంగా మృతుల కుటుంబాలకు రూ.లక్ష, అలాగే నష్టపోయిన బాధితులకు రూ.5 వేలు చొప్పున టీడీపీ తరపున అందజేశారు.
ఈ నేపథ్యంలో రాజంపేట మండలంలోని ముంపు గ్రామాల్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రెండు రోజుల క్రితం పర్యటించారు. ప్రభుత్వం పట్టించుకోలేదని, ఏ మాత్రం ఆదుకునే ప్రయత్నం చేయలేదంటూ గ్రామీణులు ఆయన్నునిలదీశారు. సొంత జిల్లాపై తనకు ప్రత్యేక ప్రేమ ఉందని అసెంబ్లీ సాక్షిగా జగన్ ప్రకటించడం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో గురువారం రాజంపేట మండలంలోని ఎగువమందపల్లి, పులపుత్తూరు గ్రామాల్లో సీఎం జగన్ పర్యటించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో వరద బాధితులు మంత్రులు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నసంగతి తెలిసిందే. ప్రాణాలు పోయాక వచ్చి ఏం లాభమని అధికార పార్టీ నేతల్ని గట్టిగా ప్రశ్నిస్తున్న జనం… జగన్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తిగా మారింది.
ఇళ్లు కొట్టుకుపోయిన వాళ్లకు ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి తిరిగి నిర్మిస్తుందనే హామీ, అలాగే పంట నష్టపోయిన రైతులకు ఏ విధమైన సాయం అందిస్తారనే అంశాలే జగన్ పర్యటనలో కీలకంగా మారాయి. ప్రజల ఆశలను జగన్ వమ్ము చేస్తారా? లేక ఓదార్పుతో సరిపెడతారా? అనేది తేలాల్సి వుంది.