మాదాపూర్ డ్రగ్స్ కేసులో అనూహ్యంగా నవదీప్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. స్వయంగా సీపీ సీవీ ఆనంద్ నవదీప్ పేరును ఎనౌన్స్ చేశారు. అనుమానం వచ్చిన మీడియా మరోసారి నవదీప్ గురించి ప్రశ్నిస్తే, అవును.. అతడే, సినీ నటుడే అంటూ క్లారిటీ కూడా ఇచ్చారు.
మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి నవదీప్ ను ఏ-29గా పేర్కొన్న పోలీసులు, ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే నవదీప్ తమకు అందుబాటులో లేడని, సెల్ ఫోన్ స్విచాఫ్ చేసి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసుల తెలిపారు. ఆ వెంటనే నవదీప్ స్పందించాడు. తను పరారీలో లేనని, హైదరాబాద్ లోనే అందరికీ అందుబాటులో ఉన్నానని స్పష్టం చేశాడు.
ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. నవదీప్ ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు పోలీసుల్ని ఆదేశించింది. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, అకారణంగా తనను నిందితుడిగా చేర్చారంటూ నవదీప్ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు, నవదీప్ ను అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీచేసింది.
కోర్టు ఆదేశాలతో నవదీప్ కు తాత్కాలికంగా ఊరట లభించింది. త్వరలోనే అతడు బాహ్య ప్రపంచంలోకి రాబోతున్నాడు. చాలా రోజుల గ్యాప్ తర్వాత లవ్ మౌళి అనే సినిమాలో నటించాడు నవదీప్. ఈ సినిమా ప్రమోషన్లు తాజాగా మొదలయ్యాయి. కోర్టు ఆదేశాలతో అతడు తన సినిమా ప్రచారాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసుకోవచ్చు.
మరోవైపు ఈ కేసులో పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం పోలీసులు వేట ముమ్మరం చేశారు. ఒక్కో నిందితుడి కోసం ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేశారు. మరో వారం రోజుల్లో అందర్నీ అదుపులోకి తీసుకుంటామని చెబుతున్నారు.