స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేయడం అన్యాయమంటూ టీడీపీ గగ్గోలు పెడుతోంది. ఈ పార్టీకి మరిన్ని తోక పార్టీలో రంకెలు వేయడానికి తోడయ్యాయి. చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అని పుస్తకాలు వేసిన వాళ్లు కూడా ఇప్పుడు ఆయన్ను అరెస్ట్ చేయడం అన్యాయమని వాపోతున్నారు. ఏపీలో ఇదో విచిత్రమైన పరిస్థితి. అధికారం, కాసిన్ని సీట్ల కోసం రాజకీయ పార్టీలు ఎన్నెన్నో జిమ్మిక్కులకు పాల్పడుతున్నాయి.
చంద్రబాబుకు మద్దతు కూడగట్టడంలో టీడీపీ శ్రమిస్తోంది. అయితే జాతీయ స్థాయిలో ఆయనకు మద్దతు నామమాత్రమే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ నుంచి మద్దతు రాకపోవడం టీడీపీకి మింగుడు పడడం లేదు. కనీసం మామ కోసం కాకపోయినా, తాత స్థాపించిన టీడీపీ ప్రయోజనాల రీత్యా మద్దతుగా నిలిచి వుంటే బాగుండేదన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల వ్యక్తమవుతోంది.
తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదనే ప్రశ్న మీడియా ప్రతినిధుల నుంచి ఎదురైంది. దీంతో అచ్చెన్నాయుడికి ఏం సమాధానం చెప్పాలో దిక్కుతోచలేదు.
ఈ ప్రశ్నను జూనియర్ ఎన్టీఆర్‌నే అడగాలని ఆయన ఆన్సర్ ఇవ్వడం గమనార్హం. చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించాలని తాము ఎవరినీ అడగడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్, విజయవాడలలో సాప్ట్వేర్ ఇంజనీర్లు చంద్రబాబుకు మద్దతుగా రోడ్డు ఎక్కారని, ఇలాంటివి గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. స్కిల్ స్కామ్‌లో ఏ సంబంధం లేని చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేయడం వల్లే అంతా ఏకమై నిరసన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు మాత్రం అచ్చెన్నాయుడు మొహంలో తీవ్ర నిరాశను చూడొచ్చు.