దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ప్రశ్నలు సంధిస్తున్న వారిని విస్మరించకూడదు. వారి ప్రశ్నలతో పాటు సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.
మరీ ముఖ్యంగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ట్విటర్ వేదికగా తెలంగాణ పోలీసులను సూటిగా ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఆమె ట్వీట్ హాట్‌గా మారి తెలంగాణ పోలీసులకు వేడి పుట్టిస్తోంది.
గుత్తా జ్వాలా మొదటి నుంచి స్వతంత్ర భావాలున్న యువతి. క్రీడల్లో చోటుచేసుకునే రాజకీయాలు, వివక్ష, అణచివేత ధోరణులను ఆమె అనేక సందర్భాల్లో ధైర్యంగా ప్రశ్నించడాన్ని చూశాం. నిర్భీతికి మారుపేరుగాంచిన గుత్తా జ్వాలా ఇప్పుడు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై అదే స్ఫూర్తి, నిర్భీతితో నిగ్గదీసి అడుగుతోంది. ఆమె పేరుకు తగ్గ యువతే.
మున్ముందు అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే ప్రతీ రేపిస్టుకు ఇదే తరహా శిక్ష అమలు చేయాలని ఆమె తెలంగాణ పోలీసులను డిమాండ్ చేశారు. ఎవరైతే సమాజం పట్ల బాధ్యత లేకుండా ఇలాంటి అమానుష దుర్ఘటనలకు పాల్పడతారో వారికి ఇదే సరైన శిక్ష అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
“ఇకనైనా అత్యాచార ఘటనలకు ముగింపు దొరుకుతుందా? అత్యాచారానికి పాల్పడిన ప్రతీ ఒక్కర్నీ ఇలానే శిక్షిస్తారా”… ఇదే ‘ముఖ్యమైన ప్రశ్న’ అని నిప్పులాంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. పొగడ్తల జడివానలో తడిసి ముద్దవుతున్న తెలంగాణ పోలీసులకు జ్వాల లాంటి ప్రశ్నలు, నిలదీతలు సెగ పుట్టిస్తున్నాయి.